సాగునీటిపై ఆశలు
పాలమూరులో రెండో బాహుబలి మోటార్ ప్రారంభం.. నార్లాపూర్కు కృష్ణా జలాలు!
పాలమూరు–రంగారెడ్డి పథకంలో బాహుబలి మోటార్లను ప్రారంభించిన మంత్రి జూపల్లి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం
చివరి ఆయకట్టుకు నీరందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. పాలమూరు రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రచారానికే బీఆర్ఎస్ నేతలు ప్రాధాన్యమిస్తున్నారని విమర్శించారు.
ఇవి కూడా చదవండి: విచారణకు శ్రీలక్ష్మి.. ఏం జరగనుంది?
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(Palamuru-Rangareddy Lift Irrigation Scheme)లో భాగంగా నార్లాపూర్ రిజర్వాయర్(Narlapur Reservoir) వద్ద ఏర్పాటు చేసిన రెండు భారీ బాహుబలి మోటార్ల(Second Bahubali Motor)ను బుధవారం మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ మోటార్ల ద్వారా నార్లాపూర్ రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోయనున్నారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిస్థాయిలో పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేసిందని మంత్రి విమర్శించారు. కాలువలు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్తో పాటు ఇతర కీలక పనులను చేపట్టకపోవడంతో ఆశించిన ప్రయోజనం రైతులకు అందలేదన్నారు. గత పాలకులు ప్రాజెక్టులను పూర్తిచేసి ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. మహాత్మా గాంధీ–కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద 4.60 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా 2 లక్షల ఎకరాలు, భీమా ప్రాజెక్టు ద్వారా 2 లక్షల ఎకరాలు, కోయిలాసాగర్ ప్రాజెక్టు కింద 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉందని తెలిపారు.
ఇవి కూడా చదవండి: చైనా, జపాన్లే మా టార్గెట్
ఇంతటి ప్రాధాన్యమున్న ప్రాజెక్టులను గత ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేకపోయిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిశానిర్దేశం మేరకు సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారని జూపల్లి తెలిపారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి చివరి ఆయకట్టుకు సైతం సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రాజెక్టుల వారీగా సమస్యలను గుర్తించి పనుల పురోగతిని సమీక్షిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.