మండలిలో.. గుడిసెలు లేని తెలంగాణే లక్ష్యం

08-09-2026 | 04:30am

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): గుడిసెలు లేని తెలంగాణను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో పాటు పొదుపు మహిళా సంఘాల ద్వారా రూ.లక్ష వరకు అడ్వాన్స్ రుణం అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నట్లుగానే పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదల సొంతింటి కలను కూడా సాకారం చేస్తామన్నారు.

ఇందిరమ్మ ఇళ్లపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. స్థలాల కొరతను దృష్టిలో ఉంచుకుని జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ తరహాలోనే నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర మున్సిపల్ కార్పొరేషన్లలోనూ ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తామని వెల్లడించారు. దసరా నాటికి 2 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 20లోగా రెండో విడత ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. త్వరలో స్టీల్ పరిశ్రమల యజమానులతో సమావేశం నిర్వహించి, స్టీల్ రాయితీకి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఒక్కో ఎమ్మెల్సీకి 500 ఇళ్లు కేటాయించాలి

మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి

ఇందిరమ్మ ఇళ్లను ఒక్కో ఎమ్మెల్సీకి 500 చొప్పున కేటాయించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Council Chairman Gutta Sukhender Reddy) కోరారు. ఆయా నియోజకవర్గాల్లోని అర్హులైన వారికి ఆ ఇళ్లను మంజూరు చేసే అవకాశం ఎమ్మెల్సీలకు దక్కుతుందని తెలిపారు. నిత్యం ఎంతో మంది తమ దగ్గరకు ఇళ్ల కోసం దరఖాస్తులతో వస్తూంటారని, అలాంటి వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన సూచించారు. దీనికి మంత్రి బదులిస్తూ వచ్చే క్యాబినెట్‌లో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటానని సమాధాన మిచ్చారు. 

ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తారా.. లేదా?

శాసనమండలిలో ప్రశ్నించిన తీర్మాన్ మల్లన్న

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విషయంలో ప్రభుత్వం ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(MLC Teenmar Mallanna) పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ 2018, 2023 ఎన్నికల్లో ఆర్టీసీ విలీన హామీ ఇచ్చిందని, ముఖ్యమంత్రి స్వయంగా కార్మిక సంఘాలతో సమావేశమై ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

అసలు ప్రభుత్వానికి ఆర్టీసీ విలీనంపై ఆసక్తి ఉందా లేదా అన్న విషయాన్ని స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సోమవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆర్టీసీ విలీన ప్రక్రియ, ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు, పాత పెన్షన్ విధానం అమలు వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తారు. గ్రాట్యుటీ, పదవీ విరమణ ప్ర యోజనాలు, ఇతర భత్యాలు సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ విలీన ప్రక్రియ తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

పేదవాడు ఏ పార్టీలో ఉన్నా, ఏ కులానికి చెంది నవాడైనా అర్హత ఉంటే ఇల్లు పొందేలా పారదర్శక వ్యవస్థను అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. గత ప్రభుత్వ హయాం లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల నాణ్యతపై కూడా ఆయన విమర్శలు చేశారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఓపీఎస్‌ను అమలు చేశాయని గుర్తు చేశారు. తెలంగాణలో ఇప్పటివరకు నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమన్నారు. 

ప్రతి జిల్లాలో మైనార్టీ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలి

శాసనమండలిలో టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి

మైనార్టీ బాలికలు ఇంటర్ తర్వాత కూడా ఉన్నత విద్యను అభ్యసించేందుకు మైనార్టీ డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలను జిల్లాకొకటి చొప్పున ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శాసనమండ లిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ... ఉన్నత విద్యకు వెళ్లకుండా మైనారిటీ బాలికలు ఇంటర్ తర్వాత డ్రాపౌట్ అవుతున్నారని తెలిపారు.

పాలిటెక్న్‌లను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయొద్దని కోరారు. ప్రభుత్వం వెంటనే జీవో నెం.97ను రద్దు చేయాలన్నారు. స్కిల్ యూనివర్సిటీలో చేసే కోర్సులకు ఏఐసీటీఈ, యూజీసీ పరంగా ఏవిధమైనా గుర్తింపు ఉండదన్నారు. ప్రభుత్వం చట్టంలో మార్పులు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు, అద్యాప కులకు భరోసా ఇవ్వాలన్నారు. 

మరిన్ని వార్తలు