ఆ గ్రామపంచాయతీలో విధులు మాకొద్దు!
వరుసగా ముగ్గురు కార్యదర్శుల నిరాకరణ?
గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై పలు అనుమానాలు
సర్పంచ్ ఏకపక్ష నిర్ణయాలే కారణమంటూ స్థానికుల ఆరోపణలు
ఉన్నతాధికారుల విచారణకు డిమాండ్
కారేపల్లి సెప్టెంబర్ 8 (విజయ క్రాంతి): సింగరేణి(Singareni) మండల పరిధిలోని ఆ గ్రామపంచాయతీలో పరిపాలన వ్యవహారాలు చర్చనీయాంశంగా మారాయి. గ్రామపంచాయతీ(Gram Panchayat)లో విధులు నిర్వహించేందుకు కార్యదర్శులు వెనుకడుగు వేస్తున్నారన్న ప్రచారం స్థానికంగా కలకలం రేపుతోంది. ఇప్పటికే ముగ్గురు కార్యదర్శులు అక్కడ విధులు నిర్వహించలేమంటూ సంబంధిత ఉన్నతాధికారులకు నోట్ పత్రాల ద్వారా తెలియజేసినట్లు విశ్వసనీయ సమాచారం.గ్రామపంచాయతీలో సంక్షేమ పథకాల అమలు జరుగుతున్నప్పటికీ, కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసే సమయంలో అర్హత ఆధారంగా కాకుండా తాను సూచించిన వారికే పథకాలు మంజూరు చేయాలంటూ సర్పంచ్ ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలువినిపిస్తున్నాయి.
దీంతో విధి నిర్వహణలో అధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు.అదే విధంగా గ్రామపంచాయతీ నిధుల వినియోగంపై కూడా స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్పంచ్ తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల పేర్లతో చెక్కులు డ్రా చేయించి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారికంగా నిర్ధారణ వెలువడాల్సి ఉంది.
అధికారుల దృష్టికి చేరిన సమస్య?
ఒకే గ్రామపంచాయతీలో వరుసగా కార్యదర్శులు విధులకు నిరాకరిస్తున్నారనే విషయం నిజమైతే, దాని వెనుక ఉన్న కారణాలను ఉన్నతాధికారులు సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. గ్రామపంచాయతీ నిధుల వినియోగం, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక, చెక్కుల జారీ తదితర అంశాలపై సంపూర్ణ ఆడిట్‌తో పాటు విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు, ప్రభుత్వ నిధులు నిబంధనల ప్రకారం వినియోగించబడుతున్నాయా? కార్యదర్శులు విధులు నిర్వహించేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారు? అనే ప్రశ్నలకు సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.ఆ గ్రామపంచాయతీ వ్యవహారాలపై ఉన్నతాధికారులు స్పందించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు
