ప్రమాదంపై కార్మికుల లొల్లి
బెల్లంపల్లి,( విజయ క్రాంతి): మందమర్రి ఏరియాలో కాసిపేట -2 గనిపై కార్మికులు ఆందోళన చేశారు. సోమవారం జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు గాయపడిన సంగతి తెలిసిందే. గనిలో కార్మికులపై పనిభారం, ఒత్తిడి, రక్షణ చర్యలపై అధికారుల నిర్లక్ష్యం పై కార్మికులు ఆందోళనకు దిగారు. వందలాది కార్మికులు అధికారుల తీరుపై నిరసన తెలిపారు. గనుల్లో ఒత్తిడి తగ్గించాలని, రక్షణ చర్యలు పకడ్బందీగా అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు.
ఇలా అధికారుల తీరు మారకపోతే గనుల్లో పనిచేయలేమని అధికారులను నిలదీశారు. నలుగురు కార్మికులు రమేష్,రాజ్కుమార్ శ్రీనివాస్, క్రాంతి ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయట పడ్డారని, ఏదైనా జరిగితే అధికారులు పరణాలను తిరిగి తీసుకువస్తారని ప్రశ్నించారు. కార్మికుల ఆందోళనకు ఏ ఐ టీ యూ సీ, ఐఎన్టీయూసీ, హెచ్ ఎంఎస్ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ప్రమాద ఘటనపై వారుకూడా స్పందించారు. ప్రమాదాలపై అధికారుల తీరుపై మండిపడ్డారు. చివరకి కార్మికుల ఆందోళనకు అధికారులు దిగివచ్చారు. రక్షణ చర్యలు పనిభారం పై హామీ ఇవ్వడంతో కార్మికులు శాంతించారు.
