అసెంబ్లీ ప్రాంగణంలో సెంట్రల్ హాల్
ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా హాజరు
ఇక ఒకే భవనంలో శాసనసభ, శాసనమండలి
హాల్‌కు ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు పేరు
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ హాల్‌ను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Assembly Speaker Gaddam Prasad Kumar), శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. అసెంబ్లీ సెంట్రల్ హాల్‌కు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తండ్రి, ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు పేరు పెట్టారు. కాగా సెంట్రల్ హాల్‌లో సదుపాయాలను మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు.
పార్లమెంటు తరహాలో..
పార్లమెంటు తరహాలో అసెంబ్లీ భవనంలో సెంట్రల్ హాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ భవనంలోనే తెలంగాణ శాసనసభ, శాసన మండలి రెండూ కొలువుదీరాయి. లాబీలు, ఎమ్మెల్యేల లాంజ్‌ను ఆధనీకరించి, యుద్ధ ప్రాతిపదికన సెంట్రల్ హాల్‌ను నిర్మించారు. ఇందుకోసం సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. పార్లమెంట్ తరహాలో అసెంబ్లీలో సభ్యులకు సెంట్రల్ హాలు ఉం డాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా, సభ్యుల గౌరవం పెంచేలా అసెంబ్లీ ప్రాంగణంలో అవసరమైన మార్పులు చేయాలని కూడా ఆదేశాలిచ్చారు.
