రైతులను ముంచింది బీఆర్‌ఎస్సే
- జూరాల నుంచి ‘పాలమూరు’ ప్రాజెక్టును శ్రీశైలానికి ఎందుకు మార్చారు?
- జూన్ 2028 నాటికి ఎస్‌ఎల్బీసీ పూర్తి చేస్తం: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న నీటి ఇబ్బందులకు ఎల్ నినో(El Nino) ప్రభావం ఒక్కటే కారణం కాదని, పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలోని ప్రణాళికా లోపాలు, అసమర్థ నిర్ణయా లు, ప్రాజెక్టుల అంచనాల పెంపు, పెండింగ్ పథకాల నిర్లక్ష్యం వంటివీ కారణాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని(Palamuru Rangareddy Lift Irrigation Scheme) మొదట రూపొందించిన విధంగా జూరాల నుంచి చేపట్టి ఉంటే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా(Mahabubnagar District)లో ప్రస్తుతం నెలకొన్న ఈ స్థాయి నీటి సంక్షోభం వచ్చేది కాదని స్పష్టం చేశారు.
“జూరాల రెండు తీరాలూ తెలంగాణ భూభాగంలోనే ఉన్నాయి. అక్కడి నుంచి ప్రాజెక్టును చేపడితే నీటి వనరు, ఎత్తిపోతల వ్యవస్థ, రిజర్వాయర్లు, పంపిణీ వ్యవస్థ మొత్తం తెలంగాణ నియంత్రణలోనే ఉండేది. జూరాల పరిసరాల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిజర్వాయర్లు నిర్మించి ఉంటే వరదకాలంలో వచ్చే నీటిని నిల్వ చేసి, వర్షాభావ పరిస్థితుల్లో పాలమూరు రైతాంగానికి అందించగలిగేవాళ్లం.
జూరాల నుంచి ప్రా జెక్టు మొదలై ఉంటే వరద వచ్చినప్పుడు నీటిని పట్టుకునేవాళ్లం.. కరువు వచ్చినప్పుడు రైతుకు అందించేవాళ్లం. కానీ, నాటి బీఆర్‌ఎస్ పాలకులు జూరాలను వదిలేసి పాలమూరు రైతును ఆకాశం వైపు చూసేలా చేశారు” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశా రు. మంగళవారం సెక్రటేరియెట్‌లో మంత్రి ఉత్తమ్ మీడియాతో చిట్‌చాట్ చేశారు.
కమీషన్లకు కక్కుర్తి పడ్డరు
జూరాల నుంచి పాలమూరు-రంగారెడ్డి పథకాన్ని చేపట్టి ఉంటే నీటిని ఎత్తిపోసే ఎ త్తు, నిర్మాణ వ్యయం, విద్యుత్ అవసరం, ని ర్వహణ భారం తక్కువగా ఉండేదని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్టును శ్రీశైలానికి మార్చడంతో నీటిని మరింత ఎ త్తుకు పంపాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనివల్ల భారీ సామర్థ్యం కలిగిన పంపులు, పంప్‌హౌస్‌లు, విద్యుత్ వ్యవస్థలు అవసరమయ్యాయని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరగడమే కాకుండా.. ఏటా విద్యు త్, నిర్వహణ రూపంలో తెలంగాణపై శాశ్వత ఆర్థిక భారం పడేలా చేశారని బీఆర్‌ఎస్‌పై ఆ గ్రహం వ్యక్తంచేశారు. జూరాల నుంచి తక్కు వ వ్యయంతో పూర్తయ్యే ప్రాజెక్టును శ్రీశైలానికి మార్చడం వెనుక ప్రజాప్రయోజనం లేదని.. ప్రాజెక్టు వ్యయాన్ని పెంచితే కమీష న్లు పెరుగుతాయనే కక్కుర్తితోనే నీటి వనరును మార్చారని ఆయన ఆరోపించారు.
రూ.55 వేల కోట్ల డీపీఆర్‌ను దాచారు
“పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును తాము రూ.28 వేల కోట్లతో పూర్తి చేశామని బీఆర్‌ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. అది పూర్తిగా అవాస్తవం. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే కేంద్ర జల సంఘానికి సమర్పించిన డీపీఆర్ విలువ సుమారు రూ.55 వేల కోట్లుగా ఉంది. ఆ డీపీఆర్‌లోనే పూర్తిస్థాయి పంపిణీ కాలువలు, భూసేకరణ, ఇతర అనుబంధ పనులు లేవు. వాటన్నింటినీ కలిపితే ప్రాజెక్టును సంపూర్ణంగా పూర్తి చేయడానికి రూ.70 వేల కోట్ల నుంచి 80 వేల కోట్ల వరకు అవసరమవుతుంది” అని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
గత ప్రభుత్వం సుమారు రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ ప్రాజెక్టులో మూడో వంతు పని కూడా పూర్తి కాలేదన్నారు. నాడు బీఆర్‌ఎస్ హయాంలో కమీషన్లు, డబ్బులు పారాయి కానీ కాలువల్లో నీరు మాత్రం పారలేదని పేర్కొన్నారు. 2014 జూన్ 2 నాటికే కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, రాజీవ్ భీమా ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని మంత్రి ఉత్తమ్ గుర్తుచేశారు. అయితే.. బీఆర్‌ఎస్ 2023 డిసెంబర్ వరకు అధికారంలో కొనసాగి, నీటిపారుదల రంగంపై రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక్క పెండింగ్ ప్రాజెక్టునూ సంపూర్ణంగా పూర్తి చేయలేదని విమర్శించారు.
సంతకాలు చేసి మరీ..!
కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయంటూ నాటి బీఆర్‌ఎస్ ప్రభు త్వం అంగీకరించి సంతకాలు చేసి మరీ ఒప్పందం కుదుర్చుకున్నదని మంత్రి ఉత్తమ్ తెలిపారు. తెలంగాణ వాటాను కాగితాలపై కుదించి సంతకాలు పెట్టింది బీఆర్‌ఎస్ అని విమర్శించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకం వంటి పరిణామాలు బీఆర్‌ఎస్ పాలనలోనే చోటుచే సుకున్నాయని అన్నారు. జూన్ 2028 నాటికి ఎస్‌ఎల్బీసీని పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు.