అయ్యో బిడ్డలు!

23-09-2026 | 05:30am

ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందుల మృతి

షార్ట్ సర్క్యూట్‌తో పేలిన ఏసీ యూనిట్

నవజాత శిశువుల సంరక్షణ వార్డులో ఘటన 

పరిశీలించిన మంత్రి రాజనర్సింహ 

పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశం

ఆదిలాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): ఆదిలాబాద్ రిమ్స్‌(Adilabad RIMS)లో సోమవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదం(Fire accident)లో రోజుల వయస్సున్న ముగ్గురు శిశువులు మృతిచెందారు. నవజాత శిశువుల సంరక్షణ వార్డులో(Newborn care ward) సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్(Short circuit) వల్ల ఏసీ యూనిట్ పేలిపోవడంతో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారి వార్డులో దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఊపిరాడక ముగ్గురు శిశువులు మృతి చెందారు. అర్ధరాతి ఒక్కసారిగా బాధితుల హాహాకారాలతో రిమ్స్ దద్దరిల్లింది.

ఘటన జరిగిన సమయం లో వార్డులో 27 మంది శిశువులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. దీంతో తమ పసి కందులను తీసుకుని తల్లిదండ్రులు బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన సిబ్బంది అద్దాలు పగులగొట్టి మిగతా శిశువులను సురక్షితంగా బయటకు తీశారు. అస్వస్థకు గురైన చిన్నారులను వివిధ ప్రైవేట్ ఆసుపత్రి(Private hospital)కి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలాన్ని రాత్రి జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ లు సందర్శించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు.

మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ(Department of Medical and Health) మంత్రి దామోదర రాజనర్సింహా(Damodara Raja Narasimha) ఆస్పత్రిని సందర్శించారు. హుటాహుటిన ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, అనిల్ జాదవ్, వైద్యారోగ్య శాఖ కా ర్యదర్శి క్రిస్టినా జడ్ చాంగ్తూ, డీఎంఏ వాణి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి రిమ్స్‌లో ప్రమాదం జరిగిన వార్డు ను పరిశీలించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని అధికారుల ను ఆదేశించారు.

ప్రమాదానికి గల కారణాలను రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ను అడి గి తెలుసుకున్నారు. ప్రమాదంలో సురక్షితంగా బైటపడి వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితులను డైరెక్టర్ మంత్రికి వివరించారు. ప్రమాదంలో మృతి చెందిన శిశువు ల కుటుంబ సభ్యులతో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం అన్ని విధా ల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం రిమ్స్ డైరెక్టర్ ఛాంబర్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించా రు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రిమ్స్ ఘటనలో ముగ్గురు నవజాత శిశువు లు మృతి చెందడం బాధాకరమని అన్నారు. ప్రభావిత చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. అవసరమైన చోట స్థానిక ప్రైవేట్ ఆస్పత్రుల సహకారాన్ని కూడా తీసుకున్నట్లు వెల్లడించారు. రిమ్స్‌మలో మాతా, శిశు సంరక్షణ సేవలను మరింత బలోపేతం చేసేందుకు 150 పడకల మదర్ అండ్ చైల్ హెల్త్ భవనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు.

ప్రస్తుతం రిమ్స్‌లో సుమారు 800 పడకలు ఉన్నాయని, అదనంగా 150 పడకల ఎంసిఎచ్ భవనం ఏర్పా టు చేయడం ద్వారా రిమ్స్‌ను సుమారు 950 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ కోసం నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. 

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు. ఎలక్ట్రికల్ సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ, సివిల్ స్ట్రక్చర్ సేఫ్టీ ఆడిట్లను నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. ఘటనపై బాధ్యతారాహిత్యం బయటపడినా వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు