హైదరాబాద్‌కు కొత్త పాలనా వ్యవస్థ

13-09-2026 | 05:30am

నగరాన్ని బ్లూ, గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతాం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

కోర్ అర్బన్ రీజియన్ బిల్లు-కు శాసనసభ ఆమోదం

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరానికి(Hyderabad metropolis) రాబోయే 20-30 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా కొత్త పాలనా వ్యవస్థను(Administrative System) ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని.. ఇందుకోసమే ‘కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) బిల్లు(Core Urban Region Bill)’ను తీసుకొచ్చామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Duddilla Sridhar Babu) స్పష్టం చేశారు. పాత మున్సిపల్ చట్టాన్ని మార్చడమే కాకుండా, హైదరాబాద్ మహానగర భవిష్యత్తు విస్తృతి, అవసరాలు, సంక్లిష్టతకు అనుగుణంగా సమర్థవంతమైన పాలనా వ్యవస్థను ఏర్పాటు చేయడమే ‘క్యూర్’బిల్లు ముఖ్య ఉద్దేశమ ని పేర్కొన్నారు.

‘ఒకే నగరం-ఒకే పాలన-ఒకే చట్టం’ ఆలోచనతో క్యూర్ వ్యవస్థను రూ పొందించామని.. ప్రజలకు మరింత చేరువ గా, వేగంగా, పారదర్శకంగా, సమన్వయం తో పాలన అందనుందని మంత్రి పేర్కొన్నా రు. శనివారం శాసనసభలో ‘క్యూర్’బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం మంత్రి మాట్లాడా రు. హైదరాబాద్ విస్తీర్ణం, జనాభా, అవసరా లు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో 1955 నాటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం.. ప్రస్తుత మహానగర్ అవసరాలు తీర్చలేదని తెలిపారు. 

అప్పట్లో 10-15 లక్షల జనాభాను దృష్టిలో పెట్టుకుని రూ పొందించిన చట్టం.. ఇప్పుడు 1.30 కోట్లకు చేరిన హైదరాబాద్ జనాభా అవసరాలను తీర్చలేదన్నారు. గత ఏడు దశాబ్దాల్లో హైదరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోయా యని..  చార్మినార్ నుంచి హైటెక్ సిటీ వర కు, మూసీ తీరం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు హైదరాబాద్ ఎంతో విస్తరించిందని పేర్కొన్నారు. ఇలాంటి మహానగరాన్ని 1955 నాటి చట్టంతో పాలించడం సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు.   

హైదరాబాద్ తెలంగాణ గ్రోత్ ఇంజిన్..

హైదరాబాద్ కేవలం నగరం కాదని.. తెలంగాణ ఆర్థిక ప్రగతికి ప్రధాన గ్రోత్ ఇంజ న్ అని శ్రీధర్‌బాబు అన్నారు. ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, డిఫెన్స్, లైఫ్ సైన్సెస్, డేటా సెంటర్లు, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లకు కేంద్రంగా మారిందన్నారు. 2025--26లో తెలంగాణ జీఎస్‌డీపీ రూ.17.82 లక్షల కోట్లకు చేరిందని, గత ఏడాది రూ.16.09 లక్షల కోట్లతో పోలిస్తే 10.7 శాతం వృద్ధి నమోదైందని వివరించా రు. క్యూర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్--మల్కాజ్‌గిరి జిల్లాలు రాష్ట్ర ఆర్థిక ఉత్పత్తిలో ముందున్నాయని తెలిపారు.

తెలంగాణ రైజింగ్--2047 లక్ష్యాలను సాధించాలంటే హైదరాబాద్ మరింత బలపడాన్నారు. తెలంగాణను 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు వె ళ్తున్నామని మంత్రి తెలిపారు. ఆ లక్ష్యాల సాధనలో హైదరాబాద్ కీలక పాత్ర పోషించాల్సి ఉందన్నారు. ప్రపంచ స్థాయి పెట్టుబ డులు హైదరాబాద్‌కు రావాలని, ఉద్యోగ అవకాశాలు పెరగడంతోపాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని ఆకాంక్షించారు.

ప్రపంచ నగరాలతో పోటీపడే స్థాయి కి హైదరాబాద్ ఎదగాలని, గత వైభవాన్ని కాపాడుకుంటూనే భవిష్యత్ అవసరాలకు నగరాన్ని సిద్ధం చేయాలని చెప్పారు. జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ.. మూడు కార్పొ రేషన్లకు క్యూర్ చట్టం వర్తిస్తుందని తెలిపారు. ఐదు భాగాలు, 43 చాప్టర్లు, 319 సెక్షన్లు, 9 షెడ్యూళ్లతో బిల్లును రూపొందించామని చెప్పారు.

వార్డు స్థాయిలో అధికార వికేంద్రీకరణ కొనసాగుతుందని, అదే సమయంలో నగరాన్ని ప్రభావితం చేసే ప్రధాన సమస్యలపై మొత్తం క్యూర్ పరిధిలో సమన్వయం తో నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ ఉంటుంద ని వివరించారు. డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ మా ప్రధాన ఉద్దేశమని, వార్డు స్థాయిలో పాలన ప్రజలకు చేరువగా ఉండాలన్నారు. అదే సమయంలో నగరం మొత్తం ఎదుర్కొంటున్న సమస్యలకు ఒకే సమగ్ర వ్యవస్థ పరిష్కారం చూపాలని వెల్లడించారు. 

సీఎంతో అత్యున్నత పాలక మండలి..

ముఖ్యమంత్రి అధ్యక్షతన క్యూర్ అత్యున్నత పాలకమండలిని ఏర్పాటు చేస్తున్నామ ని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. విపత్తుల నిర్వహణ, ట్రాఫిక్-రోడ్డు భద్రత, యుటిలిటీ పనుల సమన్వయానికి ప్రత్యేక సంస్థలు ఏ ర్పాటు చేస్తామని చెప్పారు. వాతావరణ మా ర్పులు, చెరువుల పరిరక్షణ, వారసత్వ కట్టడాలు, మహిళల భద్రత, ఆహార భద్రత, పట్టణ జీవనోపాధి వంటి అంశాలకూ ప్రత్యేక వ్యవస్థలు ఉంటాయని వివరించారు.

ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సేవలు, అనుమతు లకు ఒకే పోర్టల్ తీసుకొస్తామని తెలిపారు. నిర్ణీత గడువులో అనుమతులు రాకపోతే డీ మ్డ్ అప్రూవల్’, ఒకే సమగ్ర ట్రేడ్ లైసెన్స్ వంటి విధానాలను అమలు చేస్తామని, తక్షణమే స్పందించేలా వ్యవస్థను రూపొందిస్తు న్నామని తెలిపారు. 

బ్లూ సిటీ, గ్రీన్ సిటీగా..

హైదరాబాద్‌ను బ్లూ సిటీ, గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవన తొలిదశకు రూ.7,345.12 కోట్లతో అనుమతులు ఇ చ్చామని, 20 టీఎంసీల గోదావరి జలాలను హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు చర్య లు చేపట్టామని తెలిపారు. మురుగునీటిని శుద్ధి చేసి చెట్ల పెంపకం, కాలుష్య నియంత్రణకు వినియోగించాలని, చెరువులను కాపా డాలని, వరదలను నియంత్రించడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా హైదరాబాద్‌ను భవిష్యత్తు తరాలకు అనువైన నగరంగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించా రు.

1955 చట్టంలో కాలం చెల్లిన, ప్రస్తుతం అవసరం లేని వందకు పైగా నిబంధనలను తొలగించనున్నామని తెలిపారు. మంచినీటి సరఫరా, మురుగునీటి నిర్వహణకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డే ఏకైక ప్రాధికార సంస్థగా ఉం టుందని మంత్రి తెలిపారు.

చిన్నపాటి సాంకేతిక స్వభావం కలిగిన సుమారు 400 రకాల నేరాలను నేరపూరిత పరిధి నుంచి తొలగించే ఉద్దేశంతో తెలంగాణ ప్రజా విశ్వాసం నిబంధనల సవరణ చట్టం బిల్లును కూడా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. చిన్న వ్యాపారులు అనవసరమైన కేసులతో ఇబ్బందులు పడకుండా వ్యాపార నిర్వహణను సులభత రం చేయడమే లక్ష్యమన్నారు. అనంతరం ‘కోర్ అర్బన్ రీజియన్  బిల్లు--2026’కు శాసనసభ ఆమోదం తెలిపింది.

మరిన్ని వార్తలు