60 ఏళ్ల తర్వాత అంజన్న నిజరూప దర్శనం

11-11-2026 | 09:11am

మల్యాల, నవంబర్ 10 (విజయ క్రాంతి): ఉత్తర తెలంగాణ కొంగుబంగారమైన ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధిలో అరుదైన ఆధ్యాత్మిక ఘట్టానికి రంగం సిద్ధమైంది. సుమారు 60 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ స్వామివారి మూలవిరాట్‌కు మహా వైభవంగా చందనోత్సవం (Chandanotsavam) నిర్వహించనున్నారు. నవంబర్ 16 నుంచి 20 వరకు ఐదు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ మహోత్సవానికి ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ఆహ్వానించేందుకు ఆలయ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి మూలవిరాట్‌కు ప్రతి శనివారం అర్చకులు భక్తిశ్రద్ధలతో చందన లేపనం చేసేవారు. కాలక్రమేణా ఆ గంధం పొరలు దాదాపు రెండడుగుల మేర పేరుకుపోయాయి. ఎలుకల బొరియల కారణంగా లేపనం దెబ్బతినడంతో సుమారు 60 ఏళ్ల క్రితం అర్చకులు, ధర్మపురి వైదిక పండితులు శాస్త్రోక్తంగా చందనాన్ని తొలగించారు. అప్పటివరకు భక్తులకు స్వామివారి అసలు రూపురేఖలు తెలిసేవి కావు. ఆ సమయంలో ఆవిష్కృతమైన స్వామివారి నిజరూపాన్ని ప్రముఖ చిత్రకారుడు అలిశెట్టి మహరాజ్ తన కుంచెతో చిత్రించారు. అదే రూపం నేడు లక్షలాది భక్తుల ఇళ్లలో పూజలందుకుంటోంది.

ఆరు దశాబ్దాల తర్వాత తిరిగి మూలవిరాట్‌పై చందనం తొలగించడంతో పాటు ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపట్టనున్నారు. ప్రధాన గోపురంపై పవిత్ర కలశాల స్థాపన, దెబ్బతిన్న సుదర్శన చక్రాల మార్పిడి, శిథిలావస్థకు చేరిన దేవతామూర్తుల విగ్రహాలకు మరమ్మతులు చేయించనున్నారు. ఇందుకోసం దేవాదాయ శాఖ రూ.20 లక్షల నిధులతో ఏర్పాట్లు చేస్తోంది.

ఐదు రోజుల మహోత్సవంలో మూలవిరాట్‌పై చందనం తొలగించే సున్నితమైన ప్రక్రియ కొనసాగనున్న నేపథ్యంలో గర్భాలయ దర్శనాలతో పాటు అన్ని రకాల ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. వాహన పూజలకు మాత్రమే అనుమతి ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆలయ మండపంలో చెక్కతో ప్రత్యేకంగా రూపొందించిన స్వామివారి ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించి నిరంతర దర్శన సౌకర్యం కల్పించనున్నారు.

గతంలో బేతాళస్వామి ఆలయ చందనోత్సవంలో దాతల నిధుల వినియోగంపై వివాదాలు, ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి విమర్శలకు తావులేకుండా వ్యవహరించాలని భక్తులు కోరుతున్నారు. విరాళాల సేకరణ, ఖర్చుల వివరాలను బహిరంగంగా వెల్లడిస్తూ సంపూర్ణ పారదర్శకత పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

స్వామివారి మూలవిరాట్‌పై పేరుకుపోయిన చందనాన్ని ప్రత్యేక పరికరాలతో తొలగించేందుకు యాగశాలలో నిత్య హోమాలు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ అనంతరం స్వామివారి నిజరూప దర్శనాన్ని 40 రోజుల పాటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. రోజుకు సుమారు 50 వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా తాగునీరు, క్యూలైన్లు, పార్కింగ్, భద్రత వంటి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆరు దశాబ్దాల తర్వాత లభించనున్న అంజన్న నిజరూప దర్శనం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని వార్తలు