విశాఖకు అమిత్‌షా.. రెండు రోజుల పర్యటన!

11-11-2026 | 08:45am

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ, పారిశ్రామిక పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విశాఖపట్నం పర్యటనకు సిద్ధమయ్యారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి ఆయన విశాఖకు చేరుకోనున్నారు. గురువారం, శుక్రవారం జరిగే కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించనున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit)తో పాటు మహిళా అభివృద్ధి సదస్సులోనూ పాల్గొననున్నారు.

ఈ నెల 12, 13 తేదీల్లో విశాఖలో 31వ భారత పరిశ్రమల సమాఖ్య (Confederation of Indian Industry) భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానాలు ఈ కార్యక్రమానికి వేదిక కానున్నాయి. సదస్సు ప్రారంభోత్సవంలో అమిత్‌షా పాల్గొననున్నారు. 58 దేశాల నుంచి ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హాజరుకానున్నారు. సుమారు 3,800 మంది ప్రతినిధులు పాల్గొంటారని అంచనా.

సీఐఐ సదస్సులో భాగంగా నిర్వహిస్తున్న ఏపీ ఉమెన్ అండ్ గ్రోత్ సమ్మిట్-2026లోనూ అమిత్‌షా పాల్గొననున్నారు. వరుణ్ బీచ్ సమీపంలో జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన, పారిశ్రామిక రంగంలో మహిళల భాగస్వామ్యం, ఉపాధి అవకాశాల పెంపు వంటి అంశాలపై చర్చించనున్నారు.

రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై అమిత్‌షా సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఇతర ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. రాష్ట్ర పరిపాలన, భద్రత, కేంద్ర-రాష్ట్ర సమన్వయ అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

ఈసారి సీఐఐ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు భారీగా పెట్టుబడులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వాణిజ్యం, సాంకేతికత, సెమీకండక్టర్లు (Semiconductors), క్వాంటం టెక్నాలజీ, హరిత ఇంధనం, వ్యవసాయం, ఆహార భద్రత వంటి రంగాలపై చర్చలు జరగనున్నాయి. అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందాలు, పెట్టుబడుల ప్రతిపాదనలు ఈ సదస్సులో కీలకంగా నిలవనున్నాయి.

అమిత్‌షా విశాఖ పర్యటనతో రాష్ట్ర రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణతో పాటు రాష్ట్ర సమస్యలపై కేంద్రంతో చర్చించేందుకు ఈ పర్యటన వేదిక కానుంది.

మరిన్ని వార్తలు