రైతు వేదికల నిర్వహణ నిల్
- నాలుగేళ్లుగా 117 కోట్ల రూపాయలు పెండింగ్
- నిర్వహణకు ఇబ్బందులు
- ఏఈవోల జేబు నుంచి ఖర్చు.. ఆర్థికంగా సతమతం
- విద్యుత్ బిల్లుల చెల్లింపులకూ తిప్పలే
- సాలార్ ప్లాంట్ల ఏర్పాటుపై స్పష్టత కరువు
హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి) : రైతులకు సలహాలు, సూచనలు అందించాల్సిన రైతు వేదికలు(Rythu Vedikas)వ్యవసాయ విస్తరణ(Agricultural Extension) అధికారు లకు (ఏఈఓలు) ఆర్థిక భారంగా మారుతున్నాయి. రైతుల సమావేశాలు, శాస్త్రవేత్తలతో ముఖాముఖి, ప్రభుత్వ పథకాల అమలుకు వేదికలుగా ఉపయోగపడుతున్నా.. వాటి నిర్వహణకు నిధులు అందడం లేదు.
విద్యుత్ బిల్లులు చెల్లింపులు మొదలుకొని తాగునీరు, పారిశుద్ధ్యం, స్టేషనరీ, చిన్నపాటి మరమ్మత్తుల వరకు ఖర్చుల భారం సిబ్బందిపైనే పడుతోంది. నాలుగేళ్లుగా నిధులు నిలిచిపోవడంతో ఏఈఓలు సొంత డబ్బుతో రైతు వేదికలను నెట్టుకొస్తున్నారు. రైతువేదికల నిర్వహణకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నెలకు రూ.3 వేల చొప్పున అందేవి.
అనంతరం వ్యవసాయ శాఖ విజ్ఞప్తి మేరకు రూ.9 వేలకు పెంచారు. నిర్వహణ నిధులను 2022 ఏప్రిల్ నుంచి 2022 ఆగస్టు వరకు అంటే కేవలం ఐదు నెలలకు సంబంధించినవి మాత్రమే విడుదల చేశారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదు.
నెలకు రూ.9 వేల చొప్పున 2022 సెప్టెంబర్ నుంచి 2026 అక్టోబర్ వరకు 50 నెలల నిర్వహణ వ్యయాన్ని లెక్కిస్తే ఒక్కో రైతు వేదికకు రూ.4.50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. రాష్ట్రంలోని 2,601 రైతు వేదికలకు మొత్తం రూ.117.045 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా రైతు వేదికల విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు సౌర విద్యుత్ యూనిట్ల ఏర్పాటు అంశం కూడా తెరపైకి వచ్చింది.
ఒక్కో రైతు వేదికపై 3 కిలో వాట్ల సౌర విద్యుత్ యూనిట్ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. అంతకు ముందే 2025 ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాల్లోని రెండు రైతువేదికల వద్ద 10 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ యూనిట్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచింది. ఆ తర్వాత మిగతా రైతు వేదికల్లోనూ సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఆ ప్రస్తావనే లేదన్న విమర్శలున్నాయి.
ప్రభుత్వ కార్యక్రమాలన్నీ రైతు వేదికల్లోనే..
రైతువేదికలు కేవలం వ్యవసాయ శాఖ నిర్వహించే కార్యక్రమాలకే పరిమితం కాకుండా ఇతర ప్రభుత్వ కార్యక్ర మాలకు కూడా ఉపయోగపడుతున్నాయి. కళ్యాణలక్ష్మిచెక్కుల పంపిణీ, శిక్షణ, వివిధ శాఖల సమావేశాలు, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి, ఫిర్యాదుల స్వీకరణ వంటి కార్యక్రమాలకూ రైతు వేదికలనే ఉపయోగి స్తున్నారు.
అన్ని శాఖల కార్యక్రమాలకు అందుబాటులో ఉంటున్నప్పటికీ వాటి నిర్వహణకు నిధులు మాత్రం అందడం లేదు. కార్యక్రమాల నిర్వహణకు రైతువేదికలను వినియోగించుకునే ఇతర శాఖలు సైతం నిర్వహణ ఖర్చుల విషయంలో బాధ్యత తీసుకోకపోవడం సమస్యను మరింత పెంచుతోంది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి మంగళవారం రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతునేస్తం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఒక్కో వేదికకు సుమారు 30 నుంచి 60 మంది రైతులు హాజరవుతున్నారు. ఇందుకు గాను విద్యుత్ భారం పడుతున్నా పట్టించుకునే నాథుడే లేడు.
నిధులు విడుదల చేయాలని వినతులు
రైతు వేదికల నిర్వహణకు సంబంధించి పెండింగ్ నిధులను విడుదల చేయడంతో పాటు ప్రతి వేదికకు నెలవారీ నిర్వహణ మొత్తాన్ని సకాలంలో అందించాలని ఏఈఓలు కోరుతున్నారు. రైతునేస్తం వంటి కార్యక్రమాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, రైతులకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు అటెండర్లను నియమించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రైతులకు సేవలు అందించాలన్న ఉద్దేశంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రైతువేదికల నిర్వహణ బాధ్యతను క్షేత్రస్థాయి సిబ్బందిపై మోపడం సమంజనం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిధులు విడుదలు విడుదల చేయాలని ఏఈఓలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.