చేవెళ్ల వేంకటేశ్వర ఆలయాన్ని ‘తోడేస్తున్న’ పందికొక్కులు!
- దేవుని భూముల్లో అక్రమ పాగా..
- కోట్ల ఆదాయంపైనే కన్ను
- అద్దె లక్షల్లో.. ఆలయానికి మాత్రం చిల్లర పైసలే!
- ధూపదీప నైవేద్యాలకు దాతలపైనే ఆధారపడుతున్న అర్చకులు
- పట్టించుకోని దేవాదాయ శాఖ అధికారులు, ఈవో తీరుపై భక్తుల ఆగ్రహం
చేవెళ్ల, నవంబరు 10 (విజయక్రాంతి): భక్తుల ఆరాధ్య దైవమైన చేవెళ్ల శ్రీ వేంకటేశ్వర స్వామి(Sri Venkateswara Swamy of Chevella) పవిత్ర పుణ్యక్షేత్రం ప్రస్తుతం అక్రమార్కుల బారినపడి నలిగిపోతోంది. వేల కోట్ల రూపాయల విలువైన ఆలయ ఆస్తులు ఉన్నప్పటికీ, ఆలయాన్ని ’పందికొక్కులు’ తోడేస్తుండటంతో పవిత్ర పుణ్యక్షేత్రం ప్రాభవం కోల్పోతోంది. మరోవైపు ప్రభు త్వం ఇస్తున్న పైకం చాలక, నిత్యం జరిగే ధూపదీప నైవేద్యాలకు కూడా అర్చకులు దాతల వద్ద చేయి చాచాల్సిన దుస్థితి నెలకొంది.
కల్పవృక్షంగా మారిన ఆలయ భూములు..
గతంలో ఆలయ అభివృద్ధి కోసం కొంత స్థలాన్ని లీజుకు ఇస్తే.. ‘ఇంతిస్తే ఇల్లంతా నాదే‘ అన్న చందంగా అక్రమార్కులు వందల గజాల కమర్షియల్ స్థలాన్ని ఆక్రమించారు. చేవెళ్ల పట్టణంలోని ప్రధా న రహదారికి ఇరువైపులా ఉన్న ఈ విలువైన ఆలయ భూములు ఆక్రమణదారులకు కాసులు కురిపించే కల్పవృక్షంగా మారాయి.
ఇక్కడ నిర్మించిన వ్యాపార సముదాయాల ద్వారా అక్రమార్కులు నెలకు లక్షలాది రూపాయల బాటసార్లుగా మారుతుంటే, ఆలయ ఖాతాకు మాత్రం కేవలం వేలల్లోనే చెల్లిస్తున్నారు. అంతేకాకుండా, దేవాదాయ శాఖ నిబంధనలను పూర్తిగా అతిక్రమించి బహుళ అంతస్తులు నిర్మించినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పాముల భయంలో పూజారులు..
ఆలయ సత్రం, గార్డెన్, అరుగులు అన్నీ ప్రస్తుతం పందికొక్కులు, ఎలుకలకు నిలయాలుగా మారాయి. గార్డెన్ గ్రిల్స్ ప్రాం తంలో బొరియలు పెట్టడంతో ఆలయ పరిసరాలు భయానకంగా తయారయ్యాయి. గతంలో వంటగదితో పాటు పూజారి ఇంట్లోకి పాములు వచ్చిన సందర్భాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.
నిర్లక్ష్యంలో దేవాదాయ శాఖ ఈవో తీరుపై విమర్శలు..
ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకున్నప్పటికీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. పురాతన కట్టడం పట్ల అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆలయ ఆస్తులు అన్యక్రాంతమవుతున్నా, వార్తాపత్రికల్లో కథనాలు వస్తున్నా ఆలయ ఈవో స్పందించకపోవడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల చేతులకు సంకెళ్లు పడ్డాయా?
ఉన్నతాధికారులకు నివేదికలు పంపేందుకు తెల్ల కాగితం లేదా పెన్నులో సిరా అయిపోయిందా? అని భక్తులు నిలదీస్తున్నారు. ఈ ఆక్రమణల వెనుక ఉన్న అదృశ్య హస్తాలెవరివో తేల్చాలని, దేవాదాయ ధర్మాదాయ శాఖ వెంటనే స్పందించి ఆలయ భూములను స్వాధీనం చేసుకుని, క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని భక్తజనం, స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.