గ్రూప్-1 నియామకాలు.. గతాన్ని మర్చిపోవద్దని హితవు
హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-1 నియామకాల(Group-1 Recruitments) ప్రక్రియ గతంలో తీవ్ర జాప్యానికి గురైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. 2011లో ప్రారంభమైన నియామకాల ప్రక్రియ 2025 వరకు కొనసాగిందని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్(Public Service Commission)లో సంస్కరణలు చేపట్టి, నియామకాలను పారదర్శకంగా నిర్వహించిందని తెలిపారు.
గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రాజకీయ ప్రభావం ఉండేదని సీఎం విమర్శించారు. నియామక ప్రక్రియపై సరైన అవగాహన లేని వ్యక్తులను కీలక బాధ్యతల్లో నియమించడం వల్ల నిరుద్యోగులు నష్టపోయారని అన్నారు. తమ ప్రభుత్వం యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని బలోపేతం చేసేందుకు అనుభవం, నిబద్ధత ఉన్నవారికి బాధ్యతలు అప్పగించిందని వెల్లడించారు.
తాజా గ్రూప్-1 నియామకాల్లో 563 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా 562 మంది ఉద్యోగాల్లో చేరారని ముఖ్యమంత్రి తెలిపారు. నియామకాలపై కొందరు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. వివాదాలపై సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం చేసి అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు.
కొత్తగా బాధ్యతలు చేపట్టిన అధికారులు తమ నేపథ్యాన్ని, ప్రజల సమస్యలను ఎప్పటికీ మర్చిపోవద్దని రేవంత్ సూచించారు. అధికారుల పనితీరే ప్రభుత్వ ప్రతిష్ఠను నిర్ణయిస్తుందని చెప్పారు. కొద్దిమంది అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం వల్ల మొత్తం ప్రభుత్వ పాలనపై విమర్శలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. రాబోయే మూడు దశాబ్దాల తెలంగాణ భవిష్యత్తు నిర్మాణంలో అధికారుల పాత్ర కీలకమని సీఎం పేర్కొన్నారు. నిజాయితీ, క్రమశిక్షణ, ప్రజాసేవకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.