బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!

11-11-2026 | 08:34am

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం (Low Pressure Area) ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దక్షిణ అండమాన్ సముద్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం (Cyclonic Circulation) కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 13వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. అనంతరం ఇది మరింత బలపడి 14వ తేదీ నాటికి అల్పపీడనంగా మారే సూచనలు ఉన్నాయని తెలిపింది.

అల్పపీడనం ఏర్పడిన తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని కదలిక, తీవ్రతను బట్టి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు.అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు (Rainfall Alert) కురిసే అవకాశం ఉంది. సముద్రంలో వాతావరణ మార్పుల నేపథ్యంలో మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.

అల్పపీడనం ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందన్న దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. వర్ష సూచనల నేపథ్యంలో రైతులు కోతకు వచ్చిన పంటలు, ధాన్యం నిల్వల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ధాన్యం తడవకుండా సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకోవాలని సూచిస్తున్నారు.బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ఎటువైపు పయనిస్తుంది? ఎంత మేర వర్షాలు కురిపిస్తుంది? అన్నది రానున్న రెండు రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు