ఆర్టీసీ ఎన్నికల్లో ఈయూ–ఏఐటీయూసీ కూటమి ఘన విజయం

10-10-2026 | 07:42pm

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే లక్ష్యం

కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటాలు

ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్

భూపాలపల్లి,(విజయక్రాంతి): ఈ నెల 9న జరిగిన ఆర్టీసీ ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ)–ఏఐటీయూసీ కూటమి(AITUC-EU Alliance) ఘన విజయం సాధించడం అభినందనీయమని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే లక్ష్యంగా కూటమి ముందుకు సాగుతుందని తెలిపారు. శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమురయ్య భవన్‌లో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(RTC-Employees Union) నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఎన్ని నిర్బంధాలు ఎదురైనా, ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు జరిగినా కార్మికులు ఎంప్లాయీస్ యూనియన్ కూటమికి అధిక మెజారిటీతో విజయాన్ని అందించడం హర్షణీయమన్నారు.

కార్మికులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90 ఆర్టీసీ డిపోలు ఉండగా, వాటిలో 60 డిపోల్లో ఎంప్లాయీస్ యూనియన్ కూటమి విజయం సాధించిందని రాజ్ కుమార్ తెలిపారు.నాలుగు వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో కూటమి గెలుపొందడం కార్మికుల మద్దతుకు నిదర్శనమన్నారు. వరంగల్ రీజియన్ స్థాయిలోనూ కూటమి ఘన విజయం సాధించడం శుభపరిణామమని పేర్కొన్నారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా రాబోయే రోజుల్లో నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనకు కూటమి కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో కూటమిని గెలిపించిన ఆర్టీసీ కార్మికులందరికీ ఏఐటీయూసీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖ్యాత రాజు సతీష్, సీపీఐ పట్టణ కార్యదర్శి సొతుకు ప్రవీణ్ కుమార్, ఎంప్లాయీస్ యూనియన్ డిప్యూటీ సెక్రటరీ రాజయ్య, జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎల్ల గౌడ్, డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ మంతెన అనిత, డిపో వైస్ ప్రెసిడెంట్ తోక రాజయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు