ప్రజల భద్రతే పోలీసుల ప్రాధాన్యత

10-10-2026 | 05:42pm

భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 10 ( విజయక్రాంతి ) : ప్రజల భద్రతే పోలీసుల ప్రాధాన్యత అని దసరా పండుగ సెలవులను సురక్షితంగా జరుపుకోవడానికి అప్రమత్తంగా ఉండాలని, పోలీసులకు సహకరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 


ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..పండుగ సెలవుల నేపథ్యంలో ప్రజలు తమ స్వగ్రామాలకు, బంధువుల ఇండ్లకు ప్రయాణాలు చేయనున్నందున ఖాళీగా ఉండే ఇండ్లలో దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు  పండుగను దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, కాలనీలు, ఒంటరిగా ఉన్న ఇళ్ల పరిసరాల్లో పోలీస్ గస్తీని మరింత పటిష్టం చేసినట్లు తెలిపారు. రాత్రి వేళల్లో ప్రత్యేక మొబైల్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ, బీట్ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసి, అనుమానాస్పద వ్యక్తులు, కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ప్రజలు ప్రయాణానికి వెళ్లే ముందు ఇండ్లకు బలమైన తాళాలు వేసుకోవాలని, విలువైన వస్తువులు, నగదు, బంగారం వంటి వాటిని ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు. అదేవిధంగా ఊరికి వెళ్తున్న విషయాన్ని నమ్మకమైన పొరుగువారికి, గ్రామ పెద్దలకు తెలియజేయడంతో పాటు, అవసరమైతే స్థానిక పోలీస్o స్టేషన్‌కు ముందుగానే సమాచారం అందించాలని తెలిపారు. ప్రజలు తమ ఇళ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవాలని, ఇంటి తాళాల వివరాలు, ప్రయాణ వివరాలను సామాజిక మాధ్యమాల్లో బహిరంగంగా వెల్లడించవద్దని సూచించారు.

మరిన్ని వార్తలు