సర్ రద్దుకై పీడీఎస్యూ నిరసన ర్యాలీ
- ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ పై వ్యతిరేకత
- సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని
- ఢిల్లీలో ఆందోళనలను అణచివేయడంపై ఆగ్రహం
సూర్యాపేట, అక్టోబర్ 10 (విజయక్రాంతి) : ఎస్.ఐ.ఆర్ రద్దు(Cancellation of SIR) చేయాలని మరియు చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేశ్ కుమార్(Chief Election Commissioner Gyanesh Kumar) రాజీనామా చేయాలనీ జిల్లా కేంద్రంలోని 100 ఫీట్ రోడ్ నుండి ఎన్ హెచ్-65 వరకు పీడీఎస్యూ ఆధ్వర్యంలో శనివారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(Special Intensive Revision of Voter Lists) పేరుతో కోట్లాది మంది ఓట్లు తొలగించబడ్డాయని, ముఖ్యంగా ఆదివాసులు, దళితులు, మైనార్టీల ఓట్లు కుట్రపూరితంగా గల్లంతయ్యాయని మండిపడ్డారు.
తొలగించిన ఓట్లకు బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్తున్న విద్యార్థులను అడ్డుకునేందుకు మెట్రో స్టేషన్లు, రైళ్లను నిలిపివేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని, కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని విడనాడాలని హెచ్చరించారు. చనిపోయిన వారిని మినహాయించి తొలగించిన అర్హుల ఓట్లన్నింటినీ తక్షణమే పునరుద్ధరించాలని, లేనిపక్షంలో విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఉద్య్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి తదితర నాయకులు పాల్గొన్నారు