ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి,(విజయక్రాంతి): ఎల్‌నినో ప్రభావం(El Niño impact)తో వర్షపాతం తగ్గి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma) సూచించారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. నీరు, విద్యుత్‌ను అత్యంత పొదుపుగా వినియోగించాలని, తాగునీరు, సాగునీటిని వృథా చేయకుండా అవసరమైన మేరకే వినియోగించాలని తెలిపారు.
వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అవసరం లేని సమయంలో లైట్లు, ఫ్యాన్లు, విద్యుత్ పరికరాలను ఆపివేయాలని సూచించారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. నీరు, విద్యుత్ పొదుపును సామాజిక బాధ్యతగా భావించి ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.