పంకెన నుంచి పెద్దపల్లికి?
అక్రమంగా తరలుతున్న రెండో రకం ఇసుక
‘మామూలు’గా వదిలేస్తున్న మైనింగ్ అధికారులు
చర్యలు తీసుకోవాలని డిమాండ్
పలిమెల, అక్టోబర్ 15(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalpally) జిల్లా పలిమెల మండలం పంకెన నుండి రెండోరకం ఇసుకను అడ్డగోలుగా పెద్దపల్లి ఇటుక బట్టీలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగు టన్నుల రాయల్టీ ‘వే’బిల్లుతో ముప్పు టన్నుల లోడుతో అక్రమంగా రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయనికి గండికోడుతూన్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
మైనింగ్ అధికారులు పర్మిషన్ ఇచ్చిన మేరకు రెండోరకం ఇసుక పేరున ఎంత రవాణా చేస్తున్నారో అధికారులు పట్టించుకోకుండా ‘మామూలు’గా వదిలేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పంకెనలో సర్వే నెంబర్ 9/19 గరికపల్లి శివారు లోని 1.651 ఎక్స్టెన్షన్ లో ఆర్డినరీ ఎర్త్ పేరిట భూపాలపల్లి మైనింగ్ శాఖ అధికారులు పెద్దపల్లి జిల్లా ఇటుక బట్టీలకు పర్మిషన్ ఇచ్చారు. కాగా మైనింగ్ అధికారులు వారికి టన్నుకు కొంత ప్రభుత్వానికి రాయల్టీ కట్టించుకొని కాంట్రాక్టర్ కు పర్మిషన్ ఇచ్చారు.
కాని అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో కాంట్రాక్టర్ అసలు దందా మొదలుపెట్టారని, రెండో రకం ఇసుకకు పర్మిషన్ తీసుకొని కాంట్రాక్టర్ ఏకంగా 4 టన్నుల వే బిల్లు తో లారీల్లో సుమారు 26 ట న్నుల నుండి 30 టన్నుల మేర రెండో రకం ఇసుక రవాణా చేస్తున్నా అధికారులు అటువైపు చూడకపోవడం గమనార్హం. రెండోరకం ఇసుకకు నామమాత్రం గా ప్రభుత్వానికి రాయల్టీ కట్టిన కాంట్రాక్టర్ తన ఇష్టారాజ్యంగా రెండోరకం ఇసుకను తరలిస్తూ లక్షలు సొమ్ము చేసుకుంటున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పలి మేల మండలం పంకెన నుండి పెద్దపల్లి జిల్లాలోని ఇటుకబట్టికి చేరుకోవటానికి సుమా రు 10 గంటల సమయం ఇచ్చారు. ఈ 10 గంటల సమయంలో ఆ కాంట్రాక్టర్ లారీలలో 4 టన్నులకు బదులు 25నుండి 30 టన్నులు తరలించడమే కాక ఒకే ‘వే బిల్లు’పై రెండు ట్రిప్పులు కొడుతున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మైనింగ్లో లొసుగులతో అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపణలు మండలంలో దూరగా వినిపిస్తున్నాయి. ఇంత బహిరంగంగా దోపిడీ జరుగుతున్నా మైనింగ్ అధికారులు మాత్రం ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. లోడింగ్ వద్ద ఉండాల్సింది మైనింగ్ అధికారులు లేకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టారితితో అక్రమ రవాణాకు ఉతంగా మారిందని చెబుతున్నారు.