విద్యార్థినుల భద్రతే షీ టీం లక్ష్యం
కేజీబీవీ విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్(SP Sirisetti Sankeerth) ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని కేజీబీవీ కళాశాల(KGBV College)లో షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు మహిళలు, బాలికల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా షీ టీం సిబ్బంది మాట్లాడుతూ సోషల్ మీడియా ద్వారా తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోరాదని, వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలను అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. అపరిచితుల ఫోన్ కాల్స్‌కు స్పందిస్తూ వ్యక్తిగత సమాచారం వెల్లడించవద్దని, వేధింపులు ఎదురైతే భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
మహిళలు, బాలికలు ఎదుర్కొనే వేధింపుల్లో పరిచయస్తుల ప్రమేయం కూడా ఉంటుందని, అలాంటి సందర్భాల్లో ఎలాంటి భయం లేకుండా షీ టీంను సంప్రదించాలని సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
విద్యార్థినులు ప్రయాణ సమయంలో టీ సేఫ్ యాప్ ను వినియోగించడం ద్వారా తమ ప్రయాణాన్ని మరింత సురక్షితంగా చేసుకోవచ్చని, అనుమానాస్పద లింకులు, క్యూ ఆర్ కోడ్‌లు, ఏపీకే ఫైళ్లను క్లిక్ చేయకుండా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బాలికలకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే షీ టీం 8712658162, అత్యవసర పరిస్థితుల్లో 112కు, సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.