ఉపాధ్యాయుల కొరత.. పిల్లల చదువుకు తూట్లు!

14-09-2026 | 05:30am

34 పోస్టులు ఖాళీ.. 2,268 మంది విద్యార్థులపై భారం

కౌటాల, సెప్టెంబర్13 (విజయక్రాంతి): మండలంలోని ప్రభుత్వ పాఠశాల(Government schools)ల్లో ఉపాధ్యాయుల కొరత విద్యార్థుల చదువుపై ప్రభావం చూపుతోంది. మండల వ్యాప్తంగా 42 పాఠశాలలు ఉండగా.. మొత్తం 148 మంది ఉపాధ్యాయులు అవసరం. అయితే ప్రస్తుతం కేవలం 114 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.

దీంతో 34 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్యార్థులకు పూర్తిస్థాయి బోధన అందడం ప్రశ్నార్థకంగా మారింది. మండలంలో 4 జెడ్పీహెచ్‌ఎస్లు, 7 ప్రాథమికోన్నత పాఠశాలలు, 31 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో చదువుతున్న 2,268 మంది విద్యార్థులకు 114 మంది ఉపాధ్యాయులే బోధన అందిస్తున్నారు. అవసరమైన సిబ్బందితో పోలిస్తే ఉపాధ్యాయుల కొరత ఉండటంతో ఉన్న ఉపాధ్యాయులపైనే అదనపు బోధనా భారం పడుతున్న పరిస్థితి నెలకొంది.

ఖాళీలతో ఇబ్బందులు

ఒకవైపు విద్యార్థుల సంఖ్య.. మరోవైపు ఖాళీ పోస్టులు. దీంతో పాఠశాలల్లో బోధనా ప్రక్రియ సజావుగా సాగుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన స్థాయిలో వ్యక్తిగత శ్రద్ధ, పాఠ్యాంశాల బోధన అందకపోయే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.

డిప్యూటేషన్లతో మరింత భారం?

ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా ఉన్న ఉపాధ్యాయులతోనే విద్యాబోధన కొనసాగించడం విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉంటే.. మరోచోటు నుంచి డిప్యూటేష్ప సిబ్బందిని సర్దుబాటు చేయడం తాత్కాలిక పరిష్కారమే తప్ప శాశ్వత పరిష్కారం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పోస్టులు భర్తీ చేయాలి

34 ఖాళీ పోస్టులను త్వరితగతిన భర్తీ చేసి.. 2,268 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సిబ్బంది కొరత కొనసాగితే దాని ప్రభావం నేరుగా విద్యార్థుల చదువుపైనే పడే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు