కోటపల్లిలో పీడీఎస్ బియ్యం దందా..?
క్వింటాళ్ల చొప్పున మహారాష్ట్రకు తరలింపు..
ఆమ్యామ్యాలతో సరిపెట్టుకుంటున్న అధికారులు..
కోటపల్లి, సెప్టెంబర్ 13: పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పీడీఎస్ బియ్యం(PDS rice) గుట్టుచప్పుడు కాకుండా రాష్ట్రాలు దాటుతోంది... కోటపల్లి మండలం(Kotapalli Mandal)లోని 32 గ్రామాల్లో టీమ్లుగా ఏర్పడిన సిండికేట్ ముఠాలు లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు సేకరించి క్వింటాళ్ల కొద్ది జమైన తర్వాత సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్రకు గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నారు.
గ్రామాల్లో కొనుగోళ్ల దందా...
మండలంలో 11,524 స్మార్ట్ కార్డులుండగా కుటుంబ సభ్యుల ఆధారంగా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ జరుగుతుంది. పరిస్థితిని కొందరు అక్రమార్కులు తమకు అనుకూలం గా మలుచుకుంటున్నారు. అధి క ధర ఆశ చూపి బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు సిండికేట్ గా ఏర్పడి గ్రామాల్లో పిడీఎస్ బియ్యం సేకరిస్తున్నారు. గ్రామాల వారీగా టీమ్లను ఏర్పాటు చేసుకుని బియ్యం సేకరిస్తూ, అనంతరం పెద్ద మొత్తంలో తరలిస్తున్నారు. దీంతో పేదల కోసం ప్రభు త్వం అందిస్తున్న రాయితీ బియ్యం అక్రమ వ్యాపారానికి ముడిసరుకుగా మారుతోందనే విమర్శలు మెండుగా వినబడుతున్నాయి. గ్రామాలను అడ్డగా చేసుకొని దందా సాగిస్తున్నారు.
‘ఆమ్యామ్యాల’తో మిన్నకుంటున్న అధికారులు...
పీడీఎస్ బియ్యం అక్రమ దందా జోరుగా సాగడానికి కొందరు లంచాలకు అలవాటు పడిన ఆయా శాఖల అధికారుల సఫోర్టుతోనే అని మండల వాసులు బాహాటంగా పేర్కొంటున్నారు. గ్రామాల్లో పట్ట పగలే సేకరించి, వాటిని ప్రధాన రహదారి మీద నుంచే తరలిస్తున్నా ఏ ఒక్క శాఖ అధికారి కూడా ఆ వాహనాలను ఆపే ధైర్యం చేయడం లేదంటే వారికి ఏ మొత్తంలో అందుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆమ్యామ్యాలకు ఆశపడిన అధికారులు ఇప్పటికైనా సోయికి వచ్చి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై దృష్టి సారించి నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.