శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న మహారాష్ట్ర సిఎస్
భూపాలపల్లి/కాళేశ్వరం,(విజయక్రాంతి): మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రాజేష్ అగర్వాల్(Maharashtra Chief Secretary Rajesh Agarwal), గడ్చిరోలి జిల్లా కలెక్టర్ అవిశాంత్ పాడే(Gadchiroli Collector Avishant Pade) సోమవారం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని(Sri Kaleshwara Mukteshwara Swamy Temple) సందర్శించారు. ఆలయానికి చేరుకున్న వారికి అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేక మండపంలో అర్చకులు ఆశీర్వచనం అందించి, స్వామివారి శేషవస్త్రాలతో సన్మానించారు.
అనంతరం సరస్వతీ పుష్కర ఘాట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా రాబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, ప్రాధాన్యత గురించి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వారికి వివరించారు. అనంతరం పునర్నిర్మాణంలో ఉన్న శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించి, పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.