వైద్య విద్యార్థులు సేవా దృక్పథంతో ఎదగాలి
మంత్రి శ్రీధర్‌బాబు
భూపాలపల్లి వైద్య కళాశాలలో వైట్‌కోట్ వేడుక
భూపాలపల్లి,(విజయక్రాంతి): వైద్య విద్యార్థులు(Students) అంకితభావం, సేవా దృక్పథంతో చదువుకుని గొప్ప వైద్య నిపుణులుగా ఎదిగి దేశానికి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Minister Sridhar Babu) ఆకాంక్షించారు. శుక్రవారం భూపాలపల్లి ప్రభుత్వ వైద్య కళాశాల(Bhupalpally Government Medical College)లో మొదటి సంవత్సరం వైద్య విద్యార్థుల వైట్‌కోట్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
వైద్య వృత్తి కేవలం ఉపాధి మార్గం కాదని, మానవ సేవకు అంకితమైన పవిత్ర బాధ్యత అని మంత్రి అన్నారు. వైట్‌కోట్ వైద్య వృత్తిలోని పవిత్రత, నిబద్ధత, సేవాభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. పుస్తక పరిజ్ఞానంతో పాటు మానవత్వం, రోగుల పట్ల ప్రేమ, సానుభూతి, సహనం అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఆధునిక వైద్య రంగంలో కృత్రిమ మేధ, రోబోటిక్స్ వంటి సాంకేతికతలు కీలకంగా మారుతున్న నేపథ్యంలో విద్యార్థులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలని సూచించారు.
భూపాలపల్లి ప్రభుత్వ వైద్య కళాశాలలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. కళాశాల, బాలుర, బాలికల వసతిగృహాల నిర్మాణానికి సుమారు రూ.130 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు. బాలికల వసతిగృహాన్ని ఇప్పటికే ప్రారంభించామని, మరో 15 రోజుల్లో బాలుర వసతిగృహాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. విద్యార్థుల రవాణా కోసం సింగరేణి ద్వారా రెండు బస్సుల కొనుగోలుకు రూ.80 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. కళాశాలలో సెమినార్ హాళ్లకు ఏసీలు, మంచినీటి ప్లాంట్, వసతిగృహాల్లో లిఫ్ట్, జనరేటర్ తదితర సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.
వైద్య కళాశాల అభివృద్ధికి పూర్తి సహకారం
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ వైద్య కళాశాలలో మౌలిక వసతుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్లేగ్రౌండ్, గ్రంథాలయం, తరగతి గదులు, వాష్‌రూమ్‌లు, వసతిగృహాల సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.
91 శాతం ఫలితాలు అభినందనీయం
కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాల అధ్యాపకుల కృషితో 91 శాతం ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు. భూపాలపల్లి జిల్లాలో వైద్య సేవలకు ఎంతో ప్రాధాన్యత ఉందని, వైద్య కళాశాల, ఆసుపత్రి అందుబాటులోకి రావడంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు లభిస్తున్నాయని తెలిపారు. వైట్‌కోట్ ధరించడం విద్యార్థులపై గొప్ప బాధ్యతను ఉంచుతుందని, అంకితభావంతో ప్రజలకు సేవలందించాలని సూచించారు.
అంతకుముందు రూ.15 కోట్లతో నిర్మించిన వైద్య కళాశాల బాలికల వసతిగృహాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్పీ సంకీర్త్, జెన్కో చీఫ్ ఇంజినీర్ శ్రీప్రకాష్, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీధర్‌రావు, డీఎంహెచ్ఓ డా. మధుసూదన్, ఆసుపత్రి పర్యవేక్షకులు డా. వెంకటరత్నం, ప్రజాప్రతినిధులు, అధ్యాపకులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.