టీబీ రహిత సమాజమే లక్ష్యం కావాలి

08-10-2026 | 03:53pm

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 

భూపాలపల్లి, అక్టోబర్ 08 (విజయక్రాంతి): 2030 నాటికి దేశాన్ని టీబీ రహితంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు(MLA Gandra Satyanarayana Rao) సూచించారు. గురువారం ఐడీఓసీలో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టీబీ రహిత గ్రామ పంచాయతీల సన్మానం, జోష్‌ బృందాల ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక ముప్పు ఉన్న గ్రామాల్లో మొబైల్‌ ఎక్స్‌రే వాహనాలతో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. టీబీ నిర్ధారణ అయిన వారికి నాలుగు నెలల పాటు ఉచిత వైద్యం, మందులు అందించడంతో పాటు, బాధితులతో సన్నిహితంగా ఉండే వారికి మూడు నెలల పాటు ముందస్తు రక్షణ మందులు ఇస్తున్నట్లు చెప్పారు. చికిత్స పూర్తయ్యే వరకు నెలకు రూ.1,000 చొప్పున పోషణ భత్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

గ్రామాల్లో టీబీ కేసుల గుర్తింపు, అవగాహన కోసం మై భారత్‌ వాలంటీర్లతో జాయింట్‌ స్క్వాడ్‌, జోష్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టీబీ లక్షణాలు ఉన్నవారు సమీప ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో ఉచిత పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం టీబీ రహిత గ్రామాలుగా ఎంపికైన 12 గ్రామ పంచాయతీల సర్పంచులను శాలువాలు, ప్రశంసాపత్రాలతో సన్మానించారు.ఈ

కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్‌, విజయలక్ష్మి, జిల్లా వైద్యాధికారి డా. మధుసూదన్‌, వైద్యులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు