ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి
నిర్దేశిత లక్ష్యాలను సాధించాలి: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి,(విజయ క్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమమని, జిల్లాలో ఇళ్ల గ్రౌండింగ్ నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీలో కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma)తో కలిసి గృహ నిర్మాణ శాఖ, ఎంపీడీఓలు, మున్సిపల్ అధికారులతో ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రతి దశను పర్యవేక్షించి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. రెండో విడత లబ్ధిదారుల ఎంపికలో పేదరికమే ప్రామాణికంగా తీసుకుని ఎలాంటి వివక్షకు తావులేకుండా అర్హులను గుర్తించాలని సూచించారు. రెండు పడక గదుల ఇళ్ల కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ నిర్మాణాల కొలతల నమోదును ఎప్పటికప్పుడు పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులు ఆలస్యం కాకుండా చూడాలన్నారు. కాటారం డివిజన్లో ఇళ్ల నిర్మాణాల పురోగతి తక్కువగా ఉన్నందున వేగం పెంచాలని ఆదేశించారు.