ఏపీ ఎన్నికల ఎఫెక్ట్.. అలంపూర్‌లో మద్యం బంద్
నాలుగు మండలాల పరిధిలోని 19 గ్రామాల్లో విక్రయాలపై నిషేధం
అలంపూర్, నవంబర్ 4: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల(MPTC and ZPTC elections) ప్రభావం తెలంగాణ సరిహద్దు(Telangana border) ప్రాంతమైన అలంపూర్ పైనా పడింది. ఎన్నికల నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ, అలంపూర్, ఉండవెల్లి, రాజోలి మండలాల పరిధిలోని 19 గ్రామాల్లో మద్యం విక్రయాలను నిషేధిస్తూ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 3 సాయంత్రం 5 గంటల నుంచి 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.