జల హక్కులకు ముప్పు

04-11-2026 | 11:41am

తెలంగాణ జల హక్కులపై రాజీనా? పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపై కవిత ఫైర్!

హైదరాబాద్: పోలవరం–బనకచర్ల Link Project విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒకవైపు గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై సమావేశాల్లో చర్చలు జరుపుతూ.. మరోవైపు పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు అనుకూలంగా వ్యవహరించడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. నదీ జలాల వినియోగంపై ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేదని విమర్శించారు. ఎన్‌డబ్ల్యూడీఏ (NWDA) సమావేశాల్లో సమ్మక్కసాగర్‌ (తుపాకులగూడెం) నుంచి గోదావరి–కావేరి నదుల అనుసంధానాన్ని చేపట్టాలని తెలంగాణ అధికారులు ప్రతిపాదిస్తున్నారని కవిత పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రి, కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన జరిగిన దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో Polavaram–Banakacherla Link Project‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు.

ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు దక్కాల్సిన గోదావరి జలాలపై హక్కులు దెబ్బతింటాయని తాము 2024లోనే హెచ్చరించామని కవిత గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ చేపట్టాలనుకుంటున్న ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని తెలంగాణ జాగృతి తరఫున అప్పట్లోనే డిమాండ్ చేసినట్లు తెలిపారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. తెలంగాణకు హక్కుగా దక్కాల్సిన 250 TMCల గోదావరి జలాలను ఏపీకి అప్పగించడం రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగిస్తుందని ఆమె ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి.. ఏపీ సీఎం చంద్రబాబుకు ‘గురుదక్షిణ’గా తెలంగాణ నీళ్లను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాల సమావేశంతో పాటు కేంద్ర జలశక్తి మంత్రి ఏర్పాటు చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సమావేశంలోనూ ఈ ప్రాజెక్టుకు రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపారని కవిత ఆరోపించారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) అంగీకారంతోనే నదుల అనుసంధానంలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టాలని ఏపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచుతోందని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం నిర్వహిస్తున్న చర్చల నుంచి తెలంగాణ తప్పుకోవాలని, ప్రాజెక్టును నిలిపివేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని కవిత డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు