సాగు భూముల సంరక్షణకే ‘ఖేతీ బచావో’

04-11-2026 | 04:30pm
  1. ఏవో.బన్న రజిత, ఉద్యానవనాధికారి జ్యోతి
  2. అర్షణపల్లి, నారక్కపేట గ్రామాల్లో రైతులకు అవగాహన

నల్లబెల్లి, నవంబరు 4( విజయ క్రాంతి ): వ్యవసాయ భూముల సంరక్షణతో(Conservation of Agricultural Lands) పాటు యాసంగి సీజన్‌లో నీటి లభ్యతను బట్టి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని మండల వ్యవసాయ అధికారి బన్న రజిత, ఉద్యానవనాధికారి జ్యోతి రైతులకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఖేతీ బచావో అభియాన్’(Kheti Bachao Abhiyan) కార్యక్రమంలో భాగంగా మండలంలోని అర్షణపల్లి, నారక్కపేట గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులు, నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని తెలిపారు. భూసార పరీక్షల ఆధారంగానే ఎరువులను వాడాలని, అధిక రసాయనాల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులను వాడాలని సూచించారు. పంట వ్యర్థాలను తగలబెట్టకుండా నేలలోనే దున్నేయడం ద్వారా భూమి సారవంత మవుతుందన్నారు.

యాసంగిలో ఎక్కువ నీరు అవసరమయ్యే వరికి బదులుగా తక్కువ నీటితో పండే పెసర, మినుము, శనగ, వేరుశనగ, కుసుమ, నువ్వులు వంటి పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలను సాగు చేయాలని పిలుపునిచ్చారు. నీటి పొదుపు పద్ధతులు, పంట మార్పిడి విధానాల ద్వారా సాగు ఖర్చులు తగ్గి లాభాలు పొందవచ్చని వివరించారు.ఈ కార్యక్రమంలో అర్షణపల్లి సర్పంచ్ సిద్ధ సంతోష్, నారక్కపేట సర్పంచ్ దండెం సంపత్, ఏఈఓలు శివకుమార్, త్రివేణి, వ్యవసాయ శాఖ సిబ్బంది మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు