CM చంద్రబాబుకు PM ఫోన్
రైతులకు భారీ నష్టం.. ప్రధాని మోదీ కీలక భరోసా!
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌పై వరుస తుఫాన్ల ప్రభావంతో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఆరా తీశారు. అర్నబ్, మురసు తుఫాన్ల కారణంగా రాష్ట్రంలో జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు(Chandrababu Naidu) ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ప్రభావిత ప్రాంతాల పరిస్థితి, సహాయక చర్యల పురోగతిపై చర్చించారు. భారీ వర్షాలు, ఈదురుగాలులతో రైతులు తీవ్రంగా నష్టపోయారని చంద్రబాబు ప్రధానికి వివరించారు. పంటలతో పాటు రహదారులు, విద్యుత్ సరఫరా వ్యవస్థకు కూడా నష్టం వాటిల్లిందని తెలిపారు. రాష్ట్రం తిరిగి సాధారణ స్థితికి చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
తుఫాన్ల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన Relief Operations, ముందస్తు అప్రమత్తత చర్యలను ప్రధాని మోదీ ప్రశంసించారు. పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు యంత్రాంగం చేసిన కృషిని అభినందించారు. బాధిత ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు వేగవంతం చేయడం, రైతులకు అండగా నిలవడం ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి ప్రధాన సవాలుగా మారింది. కేంద్రం నుంచి అందే సహకారంపై రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. తుఫాన్ నష్టాల నుంచి ఏపీని గట్టెక్కించేందుకు కేంద్ర సాయం ఎంత త్వరగా అందుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.