మెక్క గ్రామానికి నిలిచిన తారు రోడ్డు పనులు

21-09-2026 | 05:24pm

బిచ్కుంద,(విజయక్రాంతి): దేవుడు వరమిచ్చిన పూజారి కనికరించలేదు అనే చందాగా కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో గల బిచ్కుంద మండల మెక్క గ్రామానికి పంచాయతీరాజ్ రోడ్డు నుంచి మెక్కా గ్రామం వరకు నిర్మాణం తలపెట్టిన తారు రోడ్డు పనులు గత నాలుగు నెలలుగా నిలిచిపోయాయి. ఒకే గుత్తేదారికి జుక్కల్ మండలకేంద్రంలో ఒక రోడ్డు, బిచ్కుంద మండలంలో మెక్కా రోడ్డు కాంట్రాక్టర్ కు పనులు అప్పగించారు. ఆయన శెట్లూర్ మెక్కా గ్రామం వరకు కంకర వేసి నాలుగు నెలలుగా పనులు నిలిపివేశారు. ఫలితం రహదారిపై వేసిన కంకరపై ప్రయాణం ఒక నరకం తలపిస్తుందని వాహనదారులు వాపోతున్నారు. ఈ రహదారి నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కోటి 50 లక్షల నిధులు మంజూరు చేయగా పనులు ప్రారంభించారు.

గత ఏడాది  జూన్ నెలలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరవు రహదారి నిర్మాణం పనులకు శిలాఫలకం వేశారు. శిలాఫలకం వేసి ఏడాది గడిచిపోతున్న రహదారి నిర్మాణం పనులు నాలుగు నెలలుగా నుంచి నిలిచిపోయాయి. ఈ రోడ్డుపై వేసిన కంకర పైన  అరచేతులు పెట్టుకొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై పంచాయతీరాజ్ ఏఈ అరుణ్ వివరణ కోరగా బిల్లులు ప్రభుత్వానికి పంపించడం జరిగిందని, ఈ కాంట్రాక్టర్కు జుక్కల్ మండలకేంద్రంలో కూడా ఒక రోడ్డు పనులు అప్పగించడం జరిగిందని, అక్కడ రోడ్డు పనులు పూర్తి కాగానే ఇక్కడ పనులు చేపడతామని తెలిపారు. మరో రెండు నెలల్లో ఈ రోడ్డు పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు