జర్నలిస్టుల వృత్తి కత్తి మీద సాము లాంటిది...
ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి...
బాన్సువాడ, సెప్టెంబర్ 29 (విజయ క్రాంతి): సమాజంలో జర్నలిస్టు వృత్తి ఎంతో బాధ్యతతో కూడుకున్నదని, కత్తి మీద సాము లాంటిదని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(MLA Pocharam Srinivas Reddy) అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎస్ ఆర్ ఎన్ కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ,
టీయూడబ్ల్యూజే–ఐజేయూ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జర్నలిస్టుల రెండు రోజుల శిక్షణ తరగతులను తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డితో కలిసి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ జర్నలిస్టులు తమ వృత్తి ధర్మాన్ని నిబద్ధతతో నిర్వహిస్తున్నారని అన్నారు.
విలేఖరి బాధ్యత ఎంతో విలువైనదని, ఎలాంటి ఆశలు, ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రజలకు సమాచారాన్ని అందించేందుకు జర్నలిస్టులు నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఒక వార్త సమాజంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వార్తలను ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవడం, బాధ్యతాయుతంగా వ్యవహరించడం ఎంతో ముఖ్యమని సూచించారు.
ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి రావడంతో మీడియా రంగంలో కూడా అనేక మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా, సోషల్ మీడియా కారణంగా సంఘటనలు జరిగిన వెంటనే ప్రజలకు సమాచారం చేరుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో వేగంతో పాటు వార్తలలో ఖచ్చితత్వం, విశ్వసనీయతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని వృత్తిపరమైన పరిజ్ఞానాన్ని మరింత పెంచుకోవాలని కోరారు. ఎనిమిదేళ్ల క్రితం ఎక్కడా లేని విధంగా బాన్సువాడలో 60 మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేశానన్నారు.
ఈ కార్యక్రమంలో మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఓ ఎస్ డి రెహమాన్,మాజీ అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్, ఆర్డీవో రవీందర్ రెడ్డి, ఐజేయూ జిల్లా అధ్యక్షుడు రజినీకాంత్, ప్రిన్సిపాల్ గంగాధర్, ప్రధాన కార్యదర్శి రాజేష్, ఎలక్ట్రాన్ మీడియా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ లతీఫ్, వేణు,సాయ గౌడ్ ,మోయిన్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన జర్నలిస్టులు పాల్గొన్నారు.