కేఆర్ఎంబీ సమావేశం రద్దు.. కారణమిదే!
హైదరాబాద్: కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB) 21వ సమావేశం వాయిదా పడింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న బోర్డు, అక్టోబర్ 1న జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు వెల్లడించింది. అక్టోబర్ 1న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం(Telangana Cabinet meeting) నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు KRMB సభ్యుడు, కార్యదర్శి సతీష్ కంబోజ్ తెలిపారు.
కేబినెట్ భేటీ కారణంగా తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు KRMB సమావేశానికి హాజరు కావడం సాధ్యం కాకపోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం బోర్డుకు వివరించినట్లు సమాచారం. దీంతో సమావేశాన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి సమావేశ తేదీని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని నిర్ణయిస్తామని సతీష్ కంబోజ్ తెలిపారు. ఇరు రాష్ట్రాల అధికారులతో సంప్రదింపులు పూర్తైన తర్వాత కొత్త తేదీని ప్రకటించే అవకాశం ఉంది.