73 గ్రామాలకు తాగునీటి భరోసా
నాగిరెడ్డిపేట్, నవంబర్ 22 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మూడు మండలాల పరిధిలోని 73 గ్రామాలు, ఆవాస ప్రాంతాలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు రూ.2.78 కోట్ల నిధులు (Funds) మంజూరు చేయించడంలో కీలక పాత్ర పోషించారు. గ్రామాల్లో పర్యటించిన సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలను తన బాధ్యతగా భావించిన మదన్ మోహన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ నిధులు మంజూరు చేయించారు. ఈ నిధులతో అవసరమైన తాగునీటి పనులు చేపట్టనున్నారు.
మండలాల వారీగా ఎల్లారెడ్డి మండలంలో 14 గ్రామాలు, లింగంపేట్ మండలంలో 38 గ్రామాలు, నాగిరెడ్డిపేట్ మండలంలో 21 గ్రామాలకు ప్రయోజనం చేకూరనుంది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు తాగునీరు అందించడం ప్రాథమిక అవసరమని, ఏ కుటుంబం నీటి ఇబ్బందులతో సతమతం కాకూడదనే లక్ష్యంతో నిధుల మంజూరుకు కృషి చేశానని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, వారి సమస్యలకు పరిష్కారం చూపడం తన బాధ్యతగా భావిస్తున్నానన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ప్రజల అవసరమే ప్రాధాన్యతగా, ఇచ్చిన మాటే నిబద్ధతగా ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే ముందుకు సాగుతున్నారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తాండూర్ సొసైటీ చైర్మన్ శ్రీధర్ గౌడ్ తెలిపారు