పసిడి ధరలు ఢమాల్.. కొనాలా? వద్దా?
పసిడి, వెండి, బిట్‌కాయిన్ క్రాష్.. భయపడొద్దంటున్న ప్రముఖ ఆర్థిక రచయిత!
న్యూఢిల్లీ: చేతిలో బంగారం(Gold) ఉంటే భద్రత అని భావించే రోజులు మారుతున్నాయా? పెట్టుబడుల ప్రపంచంలో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. బంగారం, వెండి, బిట్‌కాయిన్ ధరలు భారీగా పడిపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. పసిడి ధరలు 14 నెలల కనిష్ఠ స్థాయికి చేరుకోవడం మార్కెట్లలో కలకలం రేపుతోంది. అయితే ఈ పతనాన్ని కొందరు నష్టంగా చూస్తుంటే, మరికొందరు కొనుగోలు అవకాశంగా భావిస్తున్నారు. ప్రముఖ ఆర్థిక రచయిత రాబర్ట్ కియోసా(Robert Kiyosaki)కి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
పడిపోతే భయపడను.. కొనడానికి సిద్ధం!
'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి నవంబర్ 20న సోషల్ మీడియా వేదికగా బంగారం, వెండి, బిట్‌కాయిన్ పతనంపై స్పందించారు. మార్కెట్లు పడిపోతున్నప్పుడు భయంతో అమ్మేవారికి, సరైన అవకాశం కోసం వేచి చూసేవారికి మధ్య తేడా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బిట్‌కాయిన్ ధరలు మరింత తగ్గితే కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు.
బిట్‌కాయిన్‌లో అసలు మ్యాజిక్ ఇదేనా?
బిట్‌కాయిన్ మొత్తం సరఫరా 21 మిలియన్లకే పరిమితం. ఇప్పటికే సుమారు 20 మిలియన్ల బిట్‌కాయిన్లు మైనింగ్ అయ్యాయని కియోసాకి గుర్తుచేశారు. పరిమిత సరఫరా కారణంగా భవిష్యత్తులో దీనికి విలువ పెరిగే అవకాశం ఉందని ఆయన విశ్వసిస్తున్నారు. అయితే పరిమిత సరఫరా ఉన్నంత మాత్రాన ధర పెరుగుతుందని హామీ లేదు.
మరోసారి పతనం కోసం ఎదురుచూపులు!
నవంబర్ 20న చేసిన మరో వ్యాఖ్యలో కియోసాకి ఒక ముఖ్యమైన హెచ్చరిక చేశారు. ధరలు పడిపోతున్నప్పుడు తొందరపడి కొనుగోలు చేయకూడదని, పతనం పూర్తయ్యే వరకు వేచి చూడాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే మార్కెట్‌లో పడిపోతున్న ధరను చూసి వెంటనే పెట్టుబడి పెట్టడం కూడా ప్రమాదకరమేనన్న సంకేతం ఇచ్చారు.
బంగారం ధరలు ఎందుకు పడిపోతున్నాయి?
అమెరికా డాలర్ బలపడటం, బాండ్ ఈల్డ్స్ పెరగడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చన్న అంచనాలు బంగారం ధరలపై ఒత్తిడి పెంచాయి. ముఖ్యంగా వడ్డీ రేట్లు పెరిగితే వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారం ఆకర్షణ కొంత తగ్గుతుంది. ఈ పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరల పతనానికి దోహదపడ్డాయి.
ఇప్పుడే కొనాలా? మరికొంతకాలం ఆగాలా?
బంగారం ధరలు తగ్గుతున్నాయని వెంటనే కొనుగోలు చేయడం లేదా మరింత పడిపోతాయని అమ్మేయడం సరైన నిర్ణయం కాకపోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ కదలికలు, అమెరికా ఫెడ్ నిర్ణయాలు, దేశీయ డిమాండ్‌ను పరిశీలించాల్సి ఉంటుంది. బంగారం, వెండి, బిట్‌కాయిన్ పెట్టుబడుల్లో లాభాలతో పాటు నష్టాల ముప్పు కూడా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.