పంచాయతీరాజ్ డీఈ కార్యాలయంలో పత్తాలేని అధికారులు
సమయానికి రారు.. అందుబాటులో ఉండరు
ఖాళీ కుర్చీలే దర్శనం...!
బాన్సువాడ, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని పంచాయతీరాజ్ డీఈ కార్యాలయం(DE Office)లో అధికారుల తీరుపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కార్యాలయానికి అధికారులు సమయానికి హాజరు కాకపోవడం, వచ్చినా అందుబాటులో లేకపోవడంతో వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
శనివారం విజయక్రాంతి(Vijayakranthi) విజిట్ చేయగా, కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. అధికారులు ఎక్కడున్నారని ఆరా తీస్తే, ఫీల్డ్ విజిట్‌కు వెళ్లారు అంటూ సిబ్బంది సమాధానం ఇస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయంలోనే ఈ పరిస్థితి నెలకొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కార్యాలయంలో నలుగురు అధికారులు ఉండాల్సి ఉన్నప్పటికీ, వివిధ కారణాలతో అందుబాటులో లేకపోవడం విష్మయానికి దారి తీస్తోంది. అధికారులు కార్యాలయానికి హాజరయ్యే సమయాలు, ఫీల్డ్ విజిట్ల వివరాలను స్పష్టంగా తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కార్యాలయ పనితీరుపై పర్యవేక్షణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.






