కరెంటు కోతలు, సాగునీటి సమస్యలు పరిష్కరించాలి

17-10-2026 | 06:26pm

బీజేవైఎం జిల్లా అధ్యక్షుడుసంఘ నరేష్

హుజురాబాద్, అక్టోబర్ 17: (విజయక్రాంతి) : రైతులకు(Farmers') నిరంతర విద్యుత్ సరఫరా(Electricity supply) చేయడంతో పాటు సాగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సంఘ నరేష్(BJYM District President Sangha Naresh) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయానికి కీలకమైన సమయంలో విద్యుత్ కోతలు, సాగునీటి కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

హుజురాబాద్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పెద్దపాపయ్యపల్లి రోడ్డులోని విశేష ఫంక్షన్ హాల్‌లో శనివారం రైతుల సమస్యలపై నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు దేశానికి వెన్నెముక అని చెప్పే ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించడంలో చిత్తశుద్ధి చూపడం లేదని విమర్శించారు. పంటలు సాగు చేసుకునే కీలక సమయంలో నిరంతర విద్యుత్ అందించాలని, సాగునీటి వనరులను సమర్థవంతంగా వినియోగించి రైతులకు నీరందించాలని కోరారు.

ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని, క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి తక్షణ పరిష్కారం చూపాలని అన్నారు. రైతులను విస్మరించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

ఈ నెల 23న కరీంనగర్ కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న రైతు నిరసన కార్యక్రమంలో రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు రావుల వేణు, మాజీ పట్టణ అధ్యక్షుడు గంగిశెట్టి రాజు, ప్రధాన కార్యదర్శులు తిప్పభత్తిని రాజు, గంట సంపత్, సీనియర్ నాయకులు నరాల రాజశేఖర్, కొలిపాక శ్రీనివాస్, ఎండీ అజార్, పడారి కొమురయ్య, డోరి ఐలయ్య, కిషన్ మోర్చా అధ్యక్షుడు మాసాడి శ్రీనివాసరావు, బీజేవైఎం అధ్యక్షుడు మోటపోతుల రాకేష్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు ఎర్ర శ్రీధర్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కొలిపాక వెంకటేష్, కార్యదర్శి కొడిమ్యాల పవన్ కుమార్, బూత్ అధ్యక్షులు క్యాష వెంకటేష్, యాట రాజేష్ ఖన్నా, ఆవుల సదయ్య, కుర్ర సంపత్, కుసుమ సమ్మయ్య, దాసరి వీరన్న, మాసాడి రవీందర్ రావు, గూడూరి మల్లారెడ్డి తదితర నాయకులు, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు