బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్ ఛాలెంజ్లో టాప్ 40లో హైడ్రా బతుకమ్మ
రాగం సాంబశివరావుకు గద్దర్ కుమార్తె వెన్నెలక్క చేతుల మీదుగా అరుదైన అవార్డు
వెంకటపురం నూగూరు అక్టోబర్ 17 విజయక్రాంతి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్ ఛాలెంజ్లో(Bathukamma Young Filmmaker Challenge) వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన రాగం సాంబశివరావు(Ragam Sambasiva Rao) రూపొందించిన “హైడ్రా బతుకమ్మ(HYDRA Bathukamma)” షార్ట్ ఫిల్మ్(Short Film) టాప్ 40లో నిలిచి పార్టిసిపేషన్ అవార్డును అందుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,000 మంది పాల్గొన్న ఈ పోటీలో రెండు దశల్లో ఎంపికై టాప్ 40లో స్థానం సంపాదించడం విశేషం.
హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో గద్దర్ కుమార్తె వెన్నెలక్క చేతుల మీదుగా సాంబశివరావు అవార్డును స్వీకరించారు.ఈ షార్ట్ ఫిల్మ్లో ములుగు జిల్లా మరికాల ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు విజయ్, ఆయన భార్య శ్రావణితో పాటు పాఠశాల విద్యార్థులు నటించారు. బతుకమ్మ పండుగ విశిష్టతను, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా రూపొందించిన ఈ చిత్రంలో పాఠశాల విద్యార్థులను భాగస్వాములను చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ పోటీలో తుది ఎనిమిది చిత్రాలకు ప్రధాన బహుమతులు దక్కగా, “హైడ్రా బతుకమ్మ” టాప్ 40లో నిలిచి గుర్తింపు పొందింది. మొదటి మూడు బహుమతులు దక్కకపోయినా, వేలాది మంది పాల్గొన్న పోటీలో రెండు దశలను దాటి టాప్ 40లో స్థానం సంపాదించడం చిత్ర బృందానికి ప్రోత్సాహాన్నిచ్చే అంశం.
ఈ విజయం సృజనాత్మకతకు, కృషికి నిదర్శనంగా నిలుస్తోంది.
ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇటువంటి సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తూ, వారిలో కళాత్మక ప్రతిభను వెలికితీసేందుకు ఉపాధ్యాయుడు విజయ్ చేసిన ప్రయత్నం అభినందనీయం.
ఈ సందర్భంగా రాగం సాంబశివరావు, ఉపాధ్యాయుడు విజయ్, శ్రావణి, విద్యార్థులను స్థానికులు అభినందించారు. మరిన్ని మంచి చిత్రాలు రూపొందించి భవిష్యత్తులో ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.