వేగంగా కమ్యూనిటీ హాల్ పనులు
ముకరంపుర, అక్టోబర్ 17(విజయక్రాంతి) : కరీంనగర్(Karimnagar) నగరంలోని కాశ్మీర్గడ్డ ప్రాంతంలో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులలో భాగంగా శనివారం గడప పూజా మహోత్సవం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు(Yadagiri Sunil Rao) ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు నూతనంగా నిర్మిస్తున్న భవన ప్రవేశ ద్వారానికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు(Special prayers) నిర్వహించారు. అనంతరం పూజా కార్యక్రమం ముగిసిన వెంటనే వేదమంత్రాల నడుమ ప్రత్యేక గడపను దాటి లోనికి ప్రవేశించి, నిర్మాణ తీరుతెన్నులను పరిశీలించారు.
ఈ సందర్భంగా సునీల్ రావు మాట్లాడుతూ కాశ్మీర్గడ్డ ప్రాంత ప్రజల సంక్షేమం, సామాజిక కార్యక్రమాలు, వివాహాది శుభకార్యాలు మరియు సమావేశాల నిర్వహణ కోసం ఈ కమ్యూనిటీ హాల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా, అన్ని రకాల ఆధునిక సదుపాయాలతో ఈ భవనాన్ని అత్యుత్తమ ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను, సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు. నిర్మాణ పనులలో నాణ్యత లోపించకుండా వేగవంతంగా పూర్తి చేసి, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తామని అన్నారు.