కేంద్రమంత్రికి వినతి పత్రం అందజేసిన బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు

21-10-2026 | 07:54pm

ముకరంపుర, అక్టోబర్ 21(విజయక్రాంతి) : భారత సంచార్ నిగమ్ లిమిటెడ్(Bharat Sanchar Nigam Limited)లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మూడవ వేతన సవరణను(Wage Revision) తక్షణమే ఆమోదించి అమలు చేయాలని కోరుతూ 'ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ ఆఫ్ బీఎస్‌ఎన్‌ఎల్(All Unions and Associations of BSNL) ప్రతినిధి బృందం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌కు(Bandi Sanjay Kumar) వినతిపత్రాన్ని సమర్పించింది దేశవ్యాప్తంగా ప్రభుత్వ టెలికాం రంగాన్ని(Government telecom sector) బలోపేతం చేయడంలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్న ఎగ్జిక్యూటివ్‌లు, నాన్-ఎగ్జిక్యూటివ్‌ల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని నివారించడానికి తక్షణమే జోక్యం చేసుకోవాలని వారు కేంద్ర మంత్రిని కోరారు.

బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులకు 01 జనవరి 2017 నుండి వేతన సవరణ రావాల్సి ఉందని, అయితే 'అఫర్డబిలిటీ క్లాజ్'ను సాకుగా చూపి వేతన సవరణను నిలిపివేయడం దారుణమని ప్రతినిధులు ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బీఎస్‌ఎన్‌ఎల్ యాజమాన్యం అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసి, వేతన సవరణ సిఫార్సుల ఫైల్‌ను 24 ఫిబ్రవరి 2026 నాడే టెలికాం శాఖకు  పంపిందని నేతలు గుర్తు చేశారు. లాభాల నిబంధన మినహాయింపు కోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సూచించిన విధంగా ఈ ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్ ముందుకు తీసుకెళ్లడంలో టెలికాం శాఖ తీవ్ర ఆలస్యం చేస్తోందని విమర్శించారు.

ప్రతినిధుల వినతిపై కేంద్ర సహాయ మంత్రి  బండి సంజయ్ కుమార్ ఎంతో సానుకూలంగా స్పందించారు. బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల సమస్యలను తాను స్వయంగా పరిశీలిస్తానని, ఈ సుదీర్ఘ పెండింగ్ సమస్య పరిష్కారానికి ఖచ్చితంగా తన వంతు పూర్తి మద్దతు మరియు సహాయాన్ని అందిస్తానని ఆయన ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎన్ ఈ ఏ  జిల్లా కార్యదర్శి బండారి సంతోష్, బిఎస్ఎన్ఎల్ ఈ యు జిల్లా కార్యదర్శి ఎస్ సత్తయ్య, ఎస్ ఈ డబ్ల్యూ ఏ జిల్లా అధ్యక్షుడు జి కిషన్ , ఎన్ ఎఫ్ టి ఈ జిల్లా కార్యదర్శి సిహెచ్ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు