ఏపీలో పల్లెపోరు షురూ.. నేటి నుంచే నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలుకానుంది. MPTC, ZPTC ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 23 వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉండగా, 24న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈ నెల 27 వరకు గడువు కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లా పరిషత్లు, 659 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 659 ఎంపీపీలు, 9,829 ఎంపీటీసీ స్థానాలకు కూడా ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు సిద్ధమవుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ సందడి నెలకొనే అవకాశం ఉంది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 3న పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలు, స్థానిక రాజకీయ సమీకరణాలపై ఆసక్తి నెలకొంది.