మార్కెట్లో రైతన్న పడిగాపులు!
- నెలరోజులైనా కొనుగోళ్లు లేవు..
- మిల్లర్ల ధరల కోతలతో అన్నదాతకు నష్టం
- వర్షం వస్తే ధాన్యం తడిసే ప్రమాదం..
- వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని రైతుల డిమాండ్
హుజూరాబాద్, నవంబర్ 10: (విజయక్రాంతి)ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు(Farmers ) ఇబ్బందులు పడుతున్నారు. పంట చేతికొచ్చి నెలరోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం(Procurement centers opened) కాకపోవడంతో మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలు రాలేదని అధికారులు చెబుతుండటంతో కొనుగోళ్లపై స్పష్టత లేకుండా పోయింది.
మిల్లర్ల ధరల కోతలు
ప్రభుత్వ కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో రైతులు ప్రైవేటు మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. ధాన్యం నల్లబడిందని, నాణ్యత లేదని చెబుతూ కొనుగోలుకు నిరాకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొనుగోలు చేసినా క్వింటాల్‌కు రూ.40 కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం రూ.3,400కు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రస్తుతం రూ.3,200కే తీసుకుంటామని మిల్లర్లు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు.
వర్షం భయంతో రైతుల ఆందోళన
మార్కెట్లో ధాన్యం కుప్పలు పోసి రైతులు పడిగాపులు కాస్తున్నారు. సాయంత్రం ధా న్యం కుప్పలుగా పోసి, ఉదయం ఎండలో ఆరబెడుతూ కాపాడుకుంటున్నారు. అకాల వర్షాలు కురిస్తే ధాన్యం తడిసి రంగు మారుతుందని ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం స్పందించాలి
ప్రభుత్వం క్వింటాల్ ధాన్యానికి బోనస్‌తో కలిపి రూ.2,960 ప్రకటించినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నెలరోజులుగా మార్కెట్లోనే ఉండాలా అని ప్రశ్నిస్తున్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని, మిల్లర్లు ధరల్లో కోతలు విధించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వర్షాలు కురిసి ధాన్యం నష్టపోయేలోపే ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.
అధికారులు స్పందించడం లేదు..
ఆరుగాలం కష్టపడి పంట పండించి ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకొచ్చి నెలరోజులు కావస్తోంది. అయినా ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. ఎప్పుడు కొనుగోళ్లు మొదలవుతాయో అధికారులు కూడా స్పష్టంగా చెప్పడం లేదు. మార్కెట్‌కు ధాన్యం తీసుకురావాలని చెబుతున్నారు కానీ తీసుకొచ్చిన ధాన్యాన్ని కొ నేవారు లేరు.
రోజూ సాయంత్రం ధాన్యం కుప్పలు పోసుకుని, ఉదయం ఎండలో ఆరబెట్టుకుంటూ కాపాడుకుంటున్నాం. మిల్లర్ల దగ్గరకు వెళ్తే ధాన్యం నల్లబడిందని చెబుతూ క్వింటాల్‌కు రూ.40 కోత విధిస్తున్నారు. వా రం రోజుల క్రితం రూ.3,400కు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఇప్పుడు రూ.3,200కే తీసుకుంటామని అంటున్నారు.
ప్రభుత్వమే క్వింటాల్‌కు బోనస్‌తో కలిపి రూ.2,960 ప్రకటించింది. అయినా కొనుగోలు కేంద్రాలు ఎందుకు ప్రారంభించడం లేదో అర్థం కావడం లేదు. వర్షం వస్తే మా ధాన్యం మొత్తం తడిసి నష్టపోతాం. మా కష్టాలు అధికారులకు కనిపించడం లేదా? నెలరోజులుగా మార్కెట్లోనే ఉండాలా? వెంటనే కొనుగోళ్లు ప్రారంభించి మా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి‘ అని ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీనివాస్ రైతు కొత్తపల్లి