రైతులు ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

23-09-2026 | 12:01am

కొత్తపల్లి, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): రైతులకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఎప్పుడూ అండగా ఉంటుందని, సంస్థ ద్వారా లభించే ఉచిత న్యాయ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి శ్రీ యశ్వంత్ సింగ్(Yashwant Singh) పిలుపునిచ్చారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాల మేరకు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి  ఎస్. శివ కుమార్ అనుమతితో కొత్తపల్లి మండల రైతు వేదికలో మంగళవారం 'రైతు నేస్తం' కార్యక్రమంలో భాగంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు కోర్టు ఖర్చులు భరించలేకపోతే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయవాదిని, లీగల్ కౌన్సెలింగ్‌ను అందించనున్నట్లు, సహాయం కోసం 15100 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని సూచించారు. పట్టాదారు పాస్‌పుస్తక హక్కు, భూసేకరణ చట్టం ద్వారా తగిన నష్టపరిహారం, పునరావాసం పొందే విధానాన్ని వివరించారు.

కౌలు రైతులకు సంక్షేమ పథకాలు, కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా తక్కువ వడ్డీ రుణాలు, ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వేధింపుల నుండి రక్షణ గురించి అవగాహన కల్పించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో 'ఫసల్ బీమా యోజన' ద్వారా బీమా పరిహారం పొందవచ్చని, నాణ్యత లేని విత్తనాలు, కల్తీ ఎరువులపై వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించవచ్చని తెలిపారు. పంట వ్యర్థాలను కాల్చి వాతావరణ కాలుష్యాన్ని పెంచవద్దని కోరారు.

భూ వివాదాలు, బ్యాంక్ రుణాల సమస్యల పరిష్కారానికి లోక్ అదాలత్‌లను ఆశ్రయించాలని, కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా 'టెలి-లా', యల్.యస్.యం.యస్. పోర్టల్ డిజిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యులు, న్యాయవాదులు ఏ. కిరణ్ కుమార్, సిహెచ్. చంద్రప్రకాష్ రెడ్డి, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కే. మౌనిక, జిల్లా వ్యవసాయ అధికారి బి. ఛత్రు నాయక్, కొత్తపల్లి మండలం అధికారి కోట సంతోష్ కుమార్, ఏవో మమత, ఏఈఓ లు ఫజిల్ ,ఫరీద్, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు