జమ్మికుంట పత్తి మార్కెట్కు ఐదు రోజుల సెలవులు
ఈ నెల 22న తిరిగి మార్కెట్ ప్రారంభం
హుజురాబాద్, అక్టోబర్ 16: (విజయక్రాంతి): జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ(Jammikunta Agricultural Market Committee) పరిధిలోని పత్తి మార్కెట్ యార్డుకు ఐదు రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న-సదానందం తెలిపారు. శుక్రవారం మార్కెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సద్దుల బతుకమ్మ, మహర్నవమి, విజయదశమి పండుగలను పురస్కరించుకుని అక్టోబర్ 17 శనివారం నుంచి 21 బుధవారం వరకు మార్కెట్ యార్డు మూసివేయనున్నట్లు పేర్కొన్నారు.
తిరిగి అక్టోబర్ 22 గురువారం మార్కెట్ యార్డు పునఃప్రారంభమవుతుందని తెలిపారు. ఈ విషయాన్ని రైతులు, అడ్తి వ్యాపారులు, పత్తి కొనుగోలుదారులు, గుమస్తాలు, హమాలీలు, కార్మికులు, ట్రాక్టర్, ట్రాలీ డ్రైవర్లు గమనించాలని కోరారు. సెలవు రోజుల్లో రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ యార్డుకు తీసుకురావద్దని చైర్పర్సన్ విజ్ఞప్తి చేశారు.