కళాకారుల సమస్యలు పరిష్కరించాలి
హుజురాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): కళాకారుల సమస్యలు పరిష్కరించాలని, రాష్ట్రంలో జానపద విశ్వవిద్యాలయం(Folk University), జానపద అకాడమీ ఏర్పాటు చేయాలని సకల కళల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వలస సుభాష్ చంద్రబోస్(JAC State Convener Valasa Subhash Chandra Bose) ప్రభుత్వాన్ని కోరారు. నవంబర్ 18న కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న ధర్నాకు సంబంధించిన పోస్టర్ను శుక్రవారం హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న కళాకారుల పెన్షన్లు మంజూరు చేయాలని, ఎన్నికల హామీల్లో పేర్కొన్న కళాకారుల సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన జానపద కళలను భావితరాలకు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. 'హలో కళాకారుడా.. చలో కరీంనగర్' నినాదంతో నిర్వహించే ధర్నాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ చైర్మన్ బొజ్జ ఎల్లయ్య, కన్వీనర్ ఐల ప్రసన్న, రుద్ర రామచంద్రం, కుడికాల లక్ష్మి, మెరుగు లక్ష్మి, లంక సిరి రాజకుమార్, గజవెల్లి సమ్మయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.