మెడికల్ షాపులపై ఆకస్మిక తనిఖీలు

16-10-2026 | 04:23pm

వైద్యుల చీటీ లేకుండా నియంత్రిత మందులు విక్రయిస్తే కఠిన చర్యలు

నార్కోటిక్, డ్రగ్స్ నిరోధక శాఖ, సీఐఎస్‌ఎఫ్ విజిలెన్స్ బృందాల సంయుక్త తనిఖీలు

రామగుండం, అక్టోబర్ 16(విజయక్రాంతి): వైద్యుల(Doctors) చెల్లుబాటు అయ్యే చీటీ లేకుండా నియంత్రిత మందులను(Controlled drugs) విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. రామగుండం పోలీస్ కమిషనర్(Ramagundam Police Commissioner) ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ బి. శ్రీనివాసరావు(Task Force ACP B. Srinivasa Rao) నేతృత్వంలో శుక్రవారం ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెడికల్ షాపుల్లో నార్కోటిక్, డ్రగ్స్ నిరోధక శాఖ(Drug Control Department), సీఐఎస్‌ఎఫ్ విజిలెన్స్ బృందాలు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి.

ఈ సందర్భంగా ట్రామడాల్, టాపెంటడాల్, నైట్రాజెపామ్, ప్రెగాబాలిన్, జోల్పిడెమ్, అల్ప్రాజోలం వంటి నియంత్రిత మందులతో పాటు కోడిన్ కలిగిన దగ్గు సిరప్‌ల విక్రయాలకు సంబంధించిన రికార్డులు, వైద్యుల చీటీలు, విక్రయాల రిజిస్టర్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఔషధ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగానే మందుల విక్రయాలు జరుగుతున్నాయా అనే అంశంపై తనిఖీలు చేపట్టారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

ఈ సందర్భంగా జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పిట్ట శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, వైద్యుల చెల్లుబాటు అయ్యే చీటీ తప్పనిసరిగా అవసరమైన నియంత్రిత మందులను నిబంధనల ప్రకారమే విక్రయించాలని మెడికల్ షాపుల యజమానులు, సిబ్బందికి సూచించారు. మందుల విక్రయాలకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. అనధికారికంగా నియంత్రిత లేదా నిషేధిత మందులను విక్రయించడం, సరఫరా చేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ తనిఖీల్లో జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పిట్ట శ్రవణ్ కుమార్, నార్కోటిక్ టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ దీకొండ రమేష్, సీఐఎస్‌ఎఫ్ విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ బి. ప్రసాద్ రెడ్డి, ఎస్‌ఐ ఆర్.ఎస్. యాదవ్, హెడ్ కానిస్టేబుల్ బి. మురళీకృష్ణతో పాటు నార్కోటిక్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు