దసరా వేళ అప్రమత్తంగా ఉండండి
గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు
గజ్వేల్, అక్టోబర్ 16: దసరా పండుగ(Dasara Festival), సెలవుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గజ్వేల్ రూరల్ సర్కిల్ సీఐ డి. రవి రాజు(Gajwel Rural Circle CI D. Ravi Raju) సూచించారు. పండుగకు స్వగ్రామాలకు, విహారయాత్రలకు వెళ్లేవారు ఇంటి తలుపులు, కిటికీలకు తాళాలు వేసి, విలువైన వస్తువులను భద్రపరచుకోవాలని తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో(Social media) వెల్లడించవద్దని సూచించారు. వాహనదారులు హెల్మెట్(Motorists helmet), సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హెచ్చరించారు.
దేవాలయాలు, మార్కెట్లు, బస్టాండ్లలో విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఓటీపీ, ఏటీఎం పిన్, యూపీఐ పిన్ వివరాలను ఎవరికీ చెప్పవద్దని సూచించారు. సైబర్ ఆర్థిక మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. అత్యవసర పోలీస్ సహాయం కోసం 112 నంబర్కు ఫోన్ చేయాలని కోరారు. ప్రజలు పోలీసులకు సహకరించి దసరా పండుగను ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవాలని సీఐ డి. రవి రాజు విజ్ఞప్తి చేశారు.