ఎంజేపీ బాలికల పాఠశాలను సందర్శించిన మున్సిపల్ చైర్పర్సన్
విద్యార్థులతో ముచ్చటించి సమస్యలు, సౌకర్యాలపై ఆరా.. మెరుగైన విద్యా వాతావరణం కల్పిస్తామ్
హుజురాబాద్, అక్టోబర్ 30:(విజయక్రాంతి): హుజురాబాద్ పట్టణంలోని కేశవపట్నం,కేసీ క్యాంపులో ఉన్న ఎంజేపీ బాలికల పాఠశాలను మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు(Municipal Chairperson Rontala Suhasini Manoj Rao) శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థినులతో నేరుగా మాట్లాడి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు అందుతున్న విద్యా సదుపాయాలు, వసతి సౌకర్యాలు, భోజన నాణ్యత, పాఠశాలలోని పరిస్థితులు, ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. విద్యార్థినులు తమకు ఎదురవుతున్న ఇబ్బందులను చైర్పర్సన్ దృష్టికి తీసుకురాగా, వాటిని సావధానంగా విన్నారు. విద్యార్థులు చదువుతోపాటు ఆరోగ్యంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేలా పాఠశాలలో అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలని సూచించారు. విద్యార్థినుల విద్యాభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన వసతి, భోజన సదుపాయాలు కల్పించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. పాఠశాలలో గుర్తించిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థినులు తమ లక్ష్యాలను నిర్దేశించుకొని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సునీత బాబు, తాళ్లపెల్లి రమేష్, వెన్నెల నవీన్, మొగిలి, మహమ్మద్ ఖలీద్, పుణ్య బాబు, భాస్కర్, స్వరూప తిరుపతి, కో-ఆప్షన్ సభ్యుడు జమదగ్ని, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.