నారాయణపూర్ బాధితులను పట్టించుకోకపోవడం సిగ్గుచేటు

26-09-2026 | 11:38pm

బీఆర్ఎస్ సీనియర్ నేత కొత్త జయపాల్ రెడ్డి 

చొప్పదండి, సెప్టెంబరు 26 (విజయక్రాంతి): నారాయణపూర్ బాధితులను(Narayanpur victims) ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని... బీఆర్ఎస్ సీనియర్ నేత కొత్త జయపాల్ రెడ్డి(Senior BRS leader Kotha Jayapal Reddy) అన్నారు. మంత్రులకు మానవత్వం లేదని... ఇప్పటికైనా స్పందించకపోతే మంత్రుల ఇండ్లను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణ పూర్ గ్రామానికి వచ్చిన భూగర్బశాఖ అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు.

సమాచారం తెలుసుకున్న కొత్త జయపాల్ రెడ్డి హుటాహుటిన అక్కడకు చేరుకోగా.. ముంపు బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రులకు మానవతా ధృక్పదం లేదని, ఉమ్మడి జిల్లాకు చెందిన శ్రీధర్ బాబు, లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, బండి సంజయ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వందల కుటుంబాలు పిల్లాజెల్లలతో రోడ్డునకెక్కితే పట్టించుకున్న పాపాన లేదని మండిపడ్డారు. గత 50 రోజులుగా గ్రామస్తులు రిలే నిరాహర దీక్షలు చేపడుతుంటే పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు.

హిందుత్వం పేరిట రాజకీయం చేసే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎందుకు రావడం లేదని, హిందుత్వం ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. ప్రాణాలు పోతే కానీ పరామర్శకు రారా అని మంత్రులను ప్రశ్నించారు. ప్రభుత్వానికి చేతులెత్తి మొక్కుతున్నానని… తక్షణమే ముంపు గ్రామ బాధితులను ఆదుకోవాలని కోరారు. లేనియెడల ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూగర్బ శాఖ అధికారులు, నారాయణపూర్ ముంపు బాధితులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు