పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన
బాలల భద్రతకు చట్టాల అవగాహనే రక్షణ కవచం
సీనియర్ సివిల్ జడ్జి పి.బి. కిరణ్ కుమార్
హుజురాబాద్,(విజయక్రాంతి): బాలలపై జరిగే లైంగిక వేధింపులను అరికట్టడంతో పాటు, వారి హక్కులకు చట్టపరమైన రక్షణ కల్పించేందుకు విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడం ఎంతో అవసరమని సీనియర్ సివిల్ జడ్జ్ పి కిరణ్ కుమార్ అన్నారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో సీనియర్ సివిల్ జడ్జి పి.బి. కిరణ్ కుమార్(Judge Kiran Kumar) విద్యార్థులకు బాలల రక్షణ చట్టాల(Child Safety Laws)పై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా పోక్సో చట్టం ప్రాముఖ్యతను వివరిస్తూ మంచి స్పర్శ, చెడు స్పర్శ మధ్య తేడాలను, అసభ్య ప్రవర్తనను గుర్తించే విధానాలను వివరించారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, లైంగిక వేధింపులకు పాల్పడినా భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. బాలలపై లైంగిక నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు. అలాగే విద్యార్థులు సామాజిక మాధ్యమాలను వినియోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించారు.
ప్రతి విద్యార్థి తన హక్కులను తెలుసుకోవడంతో పాటు వ్యక్తిగత భద్రత పట్ల అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. బాలల భద్రత కేవలం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదని, పాఠశాలలు, ఉపాధ్యాయులు, సమాజం కూడా సమష్టిగా బాధ్యత తీసుకోవాలని తెలిపారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలతో బాలల హక్కులను సమర్థవంతంగా పరిరక్షించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.